BCCI | అనుకున్నదే జరిగింది. బంగ్లాదేశ్-భారత్ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ 2026 సెప్టెంబర్‌కు వాయిదా పడింది. ఈ విషయాన్ని బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. వాస్తవానికి ఈ సిరీస్ వచ్చే ఆగస్టులోనే జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఆ బంగ్లాలోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదని సమాచారం. ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు వన్డే, టీ20 సిరీస్‌లను వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని నిర్ణయించాయి. షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 17 నుంచి బంగ్లాదేశ్‌లో భారత్ మూడు వన్డేలు, టీ20 సిరీస్‌లో ఆడాల్సి ఉంది.
అయితే, రాజకీయ అనిశ్చితి కారణంగా బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆగస్టులో జరగాల్సిన వన్డే, టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్‌కు భారత జట్టును పంపేందుకు కేంద్రం అనుమతి ఇవ్వలేదని తెలుస్తున్నది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం జట్టును భారత్‌కు పంపేందుకు అనుమతి ఇవ్వలేదని సమాచారం. అయితే, రాజకీయ అనిశ్చితి కారణంగా బంగ్లాదేశ్‌లో తీవ్ర అలజడి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సిరీస్ వాయిదా వేసేందుకు బీసీసీఐ మొగ్గు చూపినట్లుగా వార్తలు వచ్చాయి.
అయితే, ప్రస్తుతానికి సిరీస్‌ను రద్దు చేయకుండా ఏడాది వాయిదా వేసేందుకు బీసీసీఐ, బీసీబీ అంగీకరించాయి. సెప్టెంబర్‌లోనైనా కేంద్రం నుంచి అనుమతి వస్తుందా లేదా అన్నది ఎదురుచూడాల్సిందే. ఇదిలా ఉండగా.. భారత్-బంగ్లాదేశ్ చివరిసారిగా ఈ ఏడాది జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు జట్లు చివరిగా 2024లో భారతదేశంలో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో ఆడాయి. ఇందులో రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి.