BCCI | ఇండియన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి గట్టి షాక్ తగిలింది. సంస్థ ప్రధాన వైద్యాధికారి అభిజిత్ సాల్వి రాజీనామా చేశారు. తాను వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. గత నెల 30తోనే తన నోటీస్ పీరియడ్ ముగిసిందని శనివారం తెలిపారు. కానీ ఇటీవల టీం ఇండియా-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్ జరిగే వరకు తన సేవలు కొనసాగించానని పేర్కొన్నారు.
ఆయన బీసీసీఐలో కీలక అధికారిగా పని చేశారు. క్రికెటర్ల వయస్సు నిర్ధారణ, యాంటీ డోపింగ్, మెడికల్ విభాగం ఇన్‌చార్జీగా అభిజిత్ సాల్వి వ్యవహరిస్తున్నారు. వచ్చేనెల జరిగే అండర్-16 బాయ్స్ నేషనల్ చాంపియన్స్ షిప్‌కు ముందే ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. బీసీసీఐతో తన పదేండ్ల ప్రయాణం అద్భుతంగా సాగిందని సాల్వి పేర్కొన్నారు. విభిన్నంగా ఏదైనా చేయడానికే తాను రాజీనామా చేశానన్నారు.
కరోనా వేళ పని చేయడం సవాల్‌గా పరిణమించిందని అభిజిత్ సాల్వి చెప్పారు. బీసీసీఐ ఆధ్వర్యంలో దాదాపు అన్ని టోర్నీలను నిర్వహించామన్నారు. దేశవాళీ క్రికెట్ కూడా బాగానే ముందుకు సాగుతున్నదని, దీనిట్ల సంతోషంగా ఉన్నానని సాల్వి తెలిపారు.