BCCI : భారత పురుషుల జట్టు ప్రధాన కోచ్‌గా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ (Gautam Gambhir) నియమితులయ్యాడు. దాంతో, గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధానికి తెరపడింది. మంగళవారం బీసీసీఐ సెక్రటరీ జై షా అధికారక ప్రకటన వెల్లడించాడు. ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని గంభీర్‌ను భర్తీ చేస్తున్నట్టు షా తెలిపాడు. రెండేండ్లు గంభీర్ పదవిలో కొనసాగనున్నాడు. త్వరలో జరుగబోయే శ్రీలంక సిరీస్‌తో కోచ్‌గా గంభీర్‌కు తొలి పరీక్ష ఎదురవ్వనుంది.
టీ20 వరల్డ్ కప్ సమయం నుంచి భారత జట్టు కొత్త కోచ్ ఎవరు? అనే ప్రశ్నకు చెక్ పడింది. అందరూ ఊహించినట్టే భారత ఓపెనర్‌గా.. ఐపీఎల్ కెప్టెన్‌గా, మెంటార్‌గా సక్సెస్ అయిన గంభీర్‌కు బీసీసీఐ కోచ్‌గా బాధ్యతలు అప్పగించింది. వరల్డ్ కప్ విజేతగా ద్రవిడ్ కోచ్ పదవికి వీడ్కోలు పలకగా.. ముక్కుసూటిగా, మొండిగా వ్యవహరించే గంభీర్‌కు తొలి ఏడాదిలోనే సవాల్ ఎదురవ్వనుంది.
వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌తో పాటు, చాంపియన్స్ ట్రోఫీల్లో టీమిండియా ప్రదర్శన గౌతీ కోచింగ్‌కు అద్దం పట్టనుంది. మరో విషయం ఏంటేంటే.. ఐపీఎల్ 16వ సీజన్‌తో విరాట్ కోహ్లీతో కయ్యానికి కాలు దువ్విన గంభీర్.. 17వ సీజన్లో ఆ గొడవకు ముగింపు పలికాడు. అయితే.. కోచ్‌గా విరాట్‌తో కటువుగా ఉంటాడా? అందరిలానే అతడిని చూస్తాడా? అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
వీరేంద్ర సెహ్వాగ్ జోడీగా గంభీర్ టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. అంతేకాదు రెండు ఐసీసీ ట్రోఫీ(2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్)లు గెలిచిన జట్టులో గౌతీ సభ్యుడు. ఐపీఎల్లో ఏడు సీజన్లు కోల్‌కతా కెప్టెన్‌గా వ్యవహరించన గౌతీ.. రెండుసార్లు జట్టును చాంపియన్‌గా నిలిపాడు. ఇక పదిహేడో సీజన్లో మెంటార్‌గా మళ్లీ కోల్‌కతాకు ట్రోఫీ కట్టబెట్టాడు. దాంతో, బీసీసీఐ పెద్దలు గౌతీని కోచ్ పదవి కోసం సంప్రదించారు. అయితే.. ఇప్పటివరకూ కోచ్‌గా మాత్రం అతడికి పెద్దగా అనుభవం లేదు.
It is with immense pleasure that I welcome Mr @GautamGambhir as the new Head Coach of the Indian Cricket Team. Modern-day cricket has evolved rapidly, and Gautam has witnessed this changing landscape up close. Having endured the grind and excelled in various roles throughout his… pic.twitter.com/bvXyP47kqJ
— Jay Shah (@JayShah) July 9, 2024
ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ తర్వాత బీసీసీఐ సెక్రటరీ జై షా.. గంభీర్‌ను కలిశాడు. ఆ సమయంలోనే భారత కోచ్‌గా గౌతీ నియామకం ఖరారైందనే వార్తలు వినిపించాయి. అనుకున్నట్టే ఈ మాజీ ఓపెనర్ భారత బోర్డు సలహా కమిటీ ముందు ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. కానీ, టీ20 వరల్డ్ కప్ ముగిసినా ద్రవిడ్ తర్వాత ఎవరు? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు.
🇮🇳🏏 THE NEW ERA BEGINS! Congratulations, @GautamGambhir, on becoming the new Head Coach of Team India!
💪🏻🔥 Here’s to a winning future!
📷 Getty • #GautamGambhir #TeamIndia #BharatArmy #COTI🇮🇳 pic.twitter.com/U38fXloNKt
— The Bharat Army (@thebharatarmy) July 9, 2024
చివరకు, జింబాబ్వే టూర్‌కు వెళ్లిన జట్టుకు కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌ను పంపాల్సి వచ్చింది. జీతం విషయంలో గంభీర్ మంకు పట్టు పట్టాడని.. అతడిని బుజ్జగించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోందనే వార్తలు వినిపించాయి. అయితే.. చర్చలు సఫలం కావడంతో గంభీర్‌ను కోచ్‌గా నియమిస్తున్నట్టు జై షా వెల్లడించాడు. ద్రవిడ్ మాదిరిగానే గౌతీకి ఏటా రూ.12 కోట్లు ఇస్తారా? అంతకంటే ఎక్కువ ముట్టజెప్పుతారా? అనేది తెలియాల్సి ఉంది.