Carlos Alcaraz | బీజింగ్: హోరాహోరిగా సాగిన చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో స్పెయిన్ కుర్రాడు కార్లొస్ అల్కారజ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో రెండో సీడ్ అల్కారజ్ 6-7 (6/8), 6-4, 7-6 (7/3) తో డిఫెండింగ్ చాంపియన్ జన్నిక్ సిన్నర్ (ఇటలీ)ను ఓడించి టైటిల్ గెలిచాడు. ఇరువురి మధ్య సుమారు మూడున్నర గంటల పాటు రసవత్తరంగా సాగిన పోరులో విజయం కోసం కుర్రాళ్లిద్దరూ నువ్వానేనా అన్నట్టుగా తలపడ్డారు.
తొలి సెట్‌ను టైబ్రేక్‌తో సిన్నర్ గెలుచుకోగా రెండో సెట్ ఒక దశలో 4-3తో వెనుకబడ్డా అల్కారజ్ అనూహ్యంగా పుంజుకుని ఆ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక నిర్ణయాత్మక మూడో సెట్ కూడా టై బ్రేక్‌కు వెళ్లగా అందులో అల్కారజ్.. 0-3తో ఉన్నా వరుసగా ఏడు పాయింట్లు గెలిచి సెట్‌తో పాటు మ్యాచ్‌నూ గెలుచుకున్నాడు. ఈ ఏడాది సిన్నర్‌పై అల్కారజ్‌కు ఇది వరుసగా మూడో విజయం. ఈ టోర్నీ మహిళల సింగిల్స్‌లో కోకో గాఫ్, అరీనా సబలెంక, ఆండ్రీవా వంటి టాప్ సీడ్ ప్లేయర్లు క్వార్టర్స్ చేరారు.