Faruque Ahmed : బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ ఫరూక్ అహ్మద్ (Faruque Ahmed)కు కొద్దిలో ప్రాణాపాయం తప్పింది. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన అతడికి సకాలంలో వైద్యం అందడంతో ప్రాణం దక్కింది. బంగ్లాదేశ్ బోర్డు ఉపాధ్యక్షుడిగా సేవలందిస్తున్న అతడు ఆదివారం ఛాతిలో తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఉన్నట్టుండి కింద కూలబడిపోయిన అతడిని వెంటనే ఢాకాలోని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఫరూక్ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని బంగ్లా బోర్డు తెలిపింది. దాంతో.. అభిమానులు, కుటుంబ సభ్యులు హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నారు.
‘శనివారం రాత్రి నుంచి ఫరూక్ ఆరోగ్యం సరిగ్గా లేదు. ఆదివారం మధ్యాహ్యాం అతడికి తీవ్రమైన ఛాతి నొప్పి వచ్చింది. దాంతో.. కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఢాకాలోని ఆస్పత్రికి తరలించారు. ఫరూక్‌కు ఆంజియోగ్రామ్ (Angiogram) నిర్వహించిన వైద్యులు రక్తనాళాల్లో బ్లాక్ ఉండడం గమనించారు. ప్రాణాలు కాపాడేందుకు సత్వరమే అతడికి స్టెంట్ వేశారు. ప్రస్తుతానికి ఫరూక్ ఆరోగ్యం నిలకడగా ఉంది. క్రిటికల్ కేర్ యూనిట్(ICC)లో ఉన్న అతడి ఆరోగ్యాన్ని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు’ అని బంగ్లా బోర్డు వెల్లడించింది.
🚨 𝗦𝗛𝗢𝗖𝗞𝗜𝗡𝗚
Former BCB president and current vice president Faruque Ahmed has been hospitalised after suffering a heart attack. He is under medical care and being closely monitored.
We wish him a quick recovery. #BCB | #BangladeshCricket pic.twitter.com/4D62NYNIZx
— Cricketangon (@cricketangon) November 9, 2025
బంగ్లాదేశ్ వెటరన్ ప్లేయర్లలో ఫరూక్ అహ్మద్ ఒకడు. 1984 నుంచి 1999 వరకూ జాతీయ జట్టుకు ఆడిన ఫరూక్ కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. వీడ్కోలు అనంతరం రెండుసార్లు జాతీయ సెలెక్టర్‌గా సేవలందించాడు ఫరూక్. 2024 ఆగస్టులో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ రాజీనామా చేయడంతో అతడు మధ్యంతర అధ్యక్షుడిగా బాధ్యతలు చేప్పటాడు. తొమ్మిది నెలల పాటు ఈ హోదాలో ఉన్న ఫరూక్ ఎన్నికల తర్వాత ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యాడు.