ఢాకా: వచ్చే నెలలో ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌కప్‌లో ఆడేది డౌట్‌గానే ఉందని బంగ్లాదేశ్ కెప్టెన్ లింటన్ దాస్(Litton Das) అన్నారు. ఇండియాలో తాము ఆడబోమని బంగ్లా క్రికెట్ బోర్డు చెప్పడంతో.. ఆ దేశ ప్రాతినిధ్యంపై ప్రస్తుతం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో ఆడుతున్న ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను బీసీసీఐ తప్పించింది. ఆ ఘటన తర్వాత ఇండియా వేదికగా జరిగే మ్యాచుల్లో తాము ఆడబోమని బంగ్లాదేశ్ చెప్పింది. దీంతో వరల్డ్‌కప్ వివాదం మరింత ముదిరింది.
వరల్డ్‌కప్ కోసం జట్టును ప్రకటించామని, కానీ తమ ఆడబోయే ప్రత్యర్థులు ఎవరు, ఏ దేశానికి వెళ్తున్నామని తెలిస్తే బాగుండేదని లింటన్ దాస్ అన్నాడు. తనలాగే యావత్ బంగ్లాదేశ్ అయోమయంలో ఉన్నట్లు పేర్కొన్నాడు. భారత్ వేదికగా జరగాల్సిన మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ అభ్యర్థించింది. కానీ ఐసీసీ మాత్రం ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నది. ఇండియాలో ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరిస్తున్న విషయంపై ఆ దేశానికి మద్దతు ఇస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చెప్పింది. అయితే ఇవాళ జరిగే ఐసీసీ బోర్డు మీటింగ్‌లో బంగ్లా పాత్రపై నిర్ణయం తీసుకోనున్నారు.