అబుదాబి: ప్రతిష్టాత్మక ఆసియాకప్‌లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. గురువారం జరిగిన గ్రూపు-బీ పోరులో బంగ్లా 7 వికెట్ల తేడాతో హాంకాంగ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన బంగ్లా..హాంకాంగ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బంగ్లా బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొంటూ హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. నిజాకత్ఖాన్(42), జీషన్ అలీ (30) రాణించారు. తంజీమ్ హసన్ (2/21), రిషాద్ (2/31), తస్కిన్ (2/38) రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లా 17.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. కెప్టెన్ లిటన్‌దాస్ (59), తౌహిద్ హృదయ్ (35 నాటౌట్) విజయంలో కీలకమయ్యారు.
హాంకాంగ్ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా ఆడుతూ పాడుతూ ఛేదించింది. జట్టు 24 పరుగులకే శుక్లా బౌలింగ్‌లో ఓపెనర్ పర్వేజ్ హుస్సేన్(19) వికెట్ కోల్పోయిన బంగ్లా వెనుకకు తగ్గలేదు. అనుభవం లేని హాంకాంగ్ బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. భారీ షాట్ ఆడే క్రమంలో ఇక్బాల్ వేసిన ఆరో ఓవర్లో తంజిద్హసన్(14)..నిజాకత్కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి బంగ్లా రెండు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది.
ఈ క్రమంలో తౌహిద్తో కలిసి కెప్టెన్ లిటన్ దాస్ ఇన్నింగ్స్‌ను గాడిలో పడేశాడు. క్రీజులో కుదురుకునేందుకు ఒకింత సమయం తీసుకున్న దాస్..ఆ తర్వాత హాంకాంగ్ బౌలర్లను లక్ష్యంగా చేసుకున్నాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలతో దాస్ టచ్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలో ముర్తజా 16వ ఓవర్లో భారీ సిక్స్‌తో 33 బంతుల్లో దాస్ అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. విజయానికి రెండు పరుగుల దూరంలో దాస్..ఇక్బాల్ బౌలింగ్‌లో ఔట్ కావడంతో మూడో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.
హాంకాంగ్: 20 ఓవర్లలో 143/7( నిజాకత్ ఖాన్ 42, జీషన్ అలీ30, తంజిమ్ 2/21, రిషాద్ 2/31),
బంగ్లాదేశ్: 17.4 ఓవర్లలో 144/3 (దాస్ 59, తౌహిద్ 35 నాటౌట్, ఇక్బాల్ 2/14, శుక్లా 1/32).