సిడ్నీ: ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ క్రికెటర్, సర్ డోనాల్డ్ బ్రాడ్‌మాన్(Sir Donald Bradman) ధరించిన అరుదైన బ్యాగీ గ్రీన్ క్యాప్‌ను వేలం వేయనున్నారు. 1947-48లో భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్ సమయంలో బ్రాడ్‌మాన్ ఆ క్యాప్‌ను ధరించారు. వచ్చే నెలలో ఆ క్యాప్‌ను వేలం వేస్తారు. భారతీయ ఆల్‌రౌండర్ శ్రీరంగ వాసుదేవ్ సోహానికి ఆ క్యాప్‌ను బ్రాడ్‌మాన్ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. స్వతంత్య్ర దేశంగా తొలిసారి ఇండియా 1947లో ఆస్ట్రేలియా క్రికెట్ టూరుకు వెళ్లింది. ఆ సమయంలో ఇండియన్ ప్లేయర్‌కు బ్రాడ్‌మాన్ ఆ క్యాప్ బహూకరించినట్లు తెలుస్తున్నది.
క్రికెట్ ఆడిన రోజుల్లో బ్రాడ్‌మాన్ అనేక క్యాప్‌లను ధరించారు. చాలా వరకు క్యాప్‌లు మ్యూజియంల్లో, ప్రైవేటు కలెక్షన్ సెంటర్లలో పెట్టారు. కానీ శ్రీరంగ వాసుదేవ్‌కు గిఫ్ట్ ఇచ్చిన ఈ క్యాప్‌ను మాత్రం ఇప్పటి వరకు పబ్లిక్‌లో ప్రదర్శించలేదు. సేల్కు కూడా పెట్టలేదు. గడిచిన 75 ఏళ్ల నుంచి ఆ క్యాప్ బ్రాడ్‌మాన్ ఫ్యామిలీ ఓనర్షిప్లోనే ఉన్నది. బ్రాడ్మాన్కు చెందిన అతి ముఖ్యమైన వస్తువుల్లో ఇదొకటి అని లాయిడ్స్ ఆక్షన్ హౌజ్ పేర్కొన్నది.
భారత్‌తో జరిగిన 1947 సిరీస్‌లో బ్రాడ్‌మాన్ అద్భుతమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించారు. అతను ఆరు ఇన్నింగ్స్‌లో 715 రన్స్ చేశాడు. 178 సగటుతో బ్యాటింగ్ చేశాడు. ఆ సిరీస్‌లో ఆస్ట్రేలియా 4-0 తేడాతో విక్టరీ కొట్టింది. బ్రాడ్‌మాన్ ఆ సిరీస్‌లో మూడు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఒక డాలర్‌తో లాయిడ్స్ ఆక్షన్స్ వేలం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జనవరి 26వ తేదీన వేలం ప్రక్రియ ముగుస్తుంది.