Babar Azam: వన్డే ప్రపంచకప్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడి సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించిన పాకిస్తాన్ క్రికెట్లో మరో వివాదం రేగింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సల్మాన్ నసీర్, పాక్ సారథి బాబర్ ఆజమ్‌ల మధ్య సాగిన వాట్సాప్ చాట్ లీక్ అయింది. ఇది కొత్త వివాదానికి దారితీసింది. పీసీబీ చీఫ్ జకా అష్రఫ్ ఓ టెలివిజన్ షోలో దీని గురించి చెప్పగా ఈ చాట్ లీక్ అవడం గమనార్హం. దీనిపై పాకిస్తాన్ మాజీలు కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు అండగా నిలుస్తుండగా మరికొందరు పీసీబీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకెళ్తే.. గడిచిన ఐదు నెలలుగా పాకిస్తాన్ క్రికెటర్లకు జీతాలు లేవని, అంతేగాక వరల్డ్ కప్‌లో వరుసగా మ్యాచ్‌లలో ఓడిపోతుండటంతో బాబర్ ఆజమ్‌ను సారథిగా తప్పిస్తారని కూడా గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలోవార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రెండ్రోజుల క్రితం పాక్ మాజీ సారథి రషీద్ లతీఫ్ కూడా ఓ ఇంటర్వ్యూలో.. బాబర్ ఆజమ్ ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా జకా అష్రఫ్ గానీ, సల్మాన్ నసీర్ గానీ రెస్పాండ్ కావడం లేదని ఆరోపించాడు.
లీక్ అయిన చాట్‌లో ఇదే విషయాన్ని సల్మాన్ నసీర్ ప్రస్తావించారు. ‘బాబర్.. నువ్వు ఫోన్, మెసేజ్ చేస్తే ఛైర్మన్ రెస్పాండ్ కావడం లేదని టీవీలలో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నువ్వేమైనా ఆయనకు ఫోన్ చేశావా..?’ అని నసీర్ అడిగాడు. దానికి బాబర్.. ‘సలామ్ సల్మాన్ భాయ్, నేను సార్ కు ఫోన్ చేయలేదు..’అని రిప్లై ఇచ్చాడు.
Shameful act done by @ARYNEWSOFFICIAL by leaking Babar Azam private WhatsApp messages on national tv. I agree on the manager conflict of interest bit but doing this is utter shameful act expected better from Mr Waseem badmi.@WaseemBadamipic.twitter.com/6Y0chDPXjH
— Mustafa (@Mustafasays_) October 29, 2023
అయితే ఈ చాట్ గురించి జకా లైవ్‌లో ప్రస్తావించారని వార్తలు వస్తున్నా.. దానిని లీక్ చేసింది కూడా అతడేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జకా అష్రఫ్ ఇంటర్వ్యూ ఇచ్చిన ‘ఎఆర్‌వై న్యూస్’ ఈ వాట్సాప్ చాట్‌ను లీక్ చేసిందని పాక్ క్రికెట్ ఫ్యాన్స్ వాపోతున్నారు. వరల్డ్ కప్ తర్వాత పాకిస్తాన్ జట్టులో భారీ మార్పులు ఉంటాయని ఇదివరకే హింట్ ఇచ్చిన పీసీబీ.. అందులో భాగంగానే బాబర్‌ను పొమ్మనలేక పొగబెడుతున్నదని వకార్ యూనిస్ వంటి పలువురు మాజీ క్రికెటర్లు వాపోతున్నారు. ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్.. రెండింటిలో గెలిచి నాలుగింటిలో ఓడి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. సెమీస్ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించిన పాక్.. తమ తర్వాతి మ్యాచ్‌లో భాగంగా మంగళవారం బంగ్లాదేశ్‌తో ఢీకొననుంది.