Actress |ఒకప్పుడు తెలుగు తెరపై అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్లలో రేఖ ప్రత్యేకంగా గుర్తుండిపోతారు. ముఖ్యంగా 2001లో విడుదలైన సూపర్ హిట్ చిత్రం ‘ఆనందం’ తో ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ సినిమా సాధించిన భారీ విజయంతో రేఖ ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా మారిపోయారు. ఆ తర్వాత 2002లో వచ్చిన ‘ఒకటో నెంబర్ కుర్రోడు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. సినీ రంగంలో కుటుంబ నేపథ్యం లేకుండానే అడుగుపెట్టిన రేఖ, చాలా చిన్న వయసులోనే తన కెరీర్‌ను ప్రారంభించారు. అయితే సరైన మార్గదర్శకత్వం లేకపోవడంతో తెలుగులో ఎక్కువ కాలం కొనసాగలేకపోయానని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అదే సమయంలో కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి అవకాశాలు రావడంతో అక్కడే తన కెరీర్‌ను కొనసాగించానని, 2014 వరకు వరుసగా సినిమాల్లో నటించిన ట్లు తెలిపారు.
2014 తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల సినీ రంగానికి పూర్తిగా దూరమైన రేఖ, ప్రీ–కోవిడ్ సమయంలో తిరిగి సినిమాల్లోకి రావాలనే ఆలోచనతో ముందడుగు వేసినట్లు చెప్పారు. కానీ అదే సమయంలో ఆమెను తీవ్ర ఆరోగ్య సమస్యలు వెంటాడాయని, దాదాపు మూడు సంవత్సరాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఆ ఆరోగ్య సమస్యల సమయంలో శారీరకంగానే కాదు, మానసికంగా, ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని రేఖ భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. వైద్య ఖర్చులు, జీవన సవాళ్లు తనను పూర్తిగా కుదిపేశాయని, ఆ రోజులు తన జీవితంలో అత్యంత కష్టమైన కాలమని పేర్కొన్నారు. “చాలా నరకం అనుభవించాను” అనే మాటలతో ఆ పరిస్థితిని వివరించారు.
తన ఆరోగ్య సమస్యల గురించి పూర్తి వివరాలు వెల్లడించడానికి రేఖ ఆసక్తి చూపలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది పట్టించుకోరని, మరికొందరు ఆనందపడతారని పేర్కొంటూ, వాటి గురించి మాట్లాడటం అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ కష్టకాలంలో తనకు దైవబలమే అండగా నిలిచిందని ఆమె చెప్పుకొచ్చారు. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ తాను ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నానని, పెళ్లి చేసుకోలేదని రేఖ వెల్లడించారు. జీవితంలో ఎదురైన అనుభవాలన్నీ తనను మరింత బలంగా మార్చాయని, ఇక ముందు జీవితాన్ని సానుకూలంగా ఎదుర్కోవాలనుకుంటున్నానని తెలిపారు. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను ‘ఆనందం’తో అలరించిన రేఖ… ఇప్పుడు తన జీవితంలోని కష్టాలు, పోరాటాల గురించి ఓపెన్‌గా మాట్లాడటం సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ భావోద్వేగాన్ని కలిగిస్తోంది.