Babar Azam | భారీ అంచనాల మధ్య ఆసియాకప్ బరిలోకి దిగి.. ఫైనల్ చేరకుండానే వెనుదిరిగిన పాకిస్థాన్ జట్టులో లుకలుకలు బయటపడ్డాయి. సూపర్-4లో భాగంగా బంగ్లాదేశ్‌పై నెగ్గి.. భారత్, శ్రీలంక చేతిలో ఓడిన పాక్.. రెండు పాయింట్లతో తుదిపోరుకు దూరమైంది. ఈ నేపథ్యంలో చివరి మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం జరిగినట్లు తెలిసింది. ఆట పూర్తయిన అనంతరం జట్టు ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్.. ప్లేయర్లు బాధ్యతాయుతంగా ఆడలేదని ఆరోపించినట్లు సమాచారం. దీనిపై స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది కోపోద్రిక్తుడైనట్లు ఓ వార్తా పత్రిక పేర్కొంది.
‘అందరినీ ఒకే గాటిన కట్టడం సరికాదని.. మెరుగైన ఆటతీరు కనబర్చిన వారిని సారథిగా ప్రశంసించాల్సిన బాధ్యత నీపై ఉంది’ అని షాహీన్ టీమ్ మీటింగ్‌లో అన్నట్లు తెలిసింది. అదే సమయంలో బాబర్ ఆజమ్ కూడా ఏదో అనడంతో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగినట్లు ఆ పత్రిక వెల్లడించింది. అదే సమయంలో పక్కన ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ ఇద్దరికీ సర్ది చెప్పి పక్కకు తీసుకెళ్లాడట. కాగా.. అసలు శ్రీలంక చేతిలో ఓటమి అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ జట్టు సభ్యులతో సమావేశం నిర్వహించకుండానే స్వదేశానికి బయలు దేరాడని కొన్ని పత్రికలు పేర్కొన్నాయి. హోటల్ రూమ్‌లో సమావేశం ఉంటుందని అంతా భావించినా.. బాబర్ మాత్రం ప్లేయర్లను కలువకుండానే వెళ్లినట్లు సమాచారం. మరి వన్డే ప్రపంచకప్‌నకు నిండా నెల రోజులు కూడా లేని సమయంలో పాకిస్థాన్ జట్టులో అంతా సవ్యంగా లేదనే విషయం మాత్రం తేట తెల్లమైంది.