శనివారం 28 మార్చి 2020
Sports - Mar 17, 2020 , 21:37:47

ఇందూరులో క్రికెట్‌ స్టేడియం నిర్మిస్తాం: అజారుద్దీన్‌

ఇందూరులో క్రికెట్‌ స్టేడియం నిర్మిస్తాం: అజారుద్దీన్‌

ఇందూరు: నిజామాబాద్‌ నగరంలోని గూపన్‌పల్లి శివారులో ఆరెకరాల స్థలంలో క్రికెట్‌ స్టేడియాన్ని నిర్మిస్తామని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌ అన్నారు. నిజామాబాద్‌ నగరంలోని గూపన్‌పల్లి శివారులో హెచ్‌సీఏ ఆధ్వర్యంలో గతంలో కొనుగోలు చేసిన ఆరెకరాల స్థలాన్ని క్రికెట్‌ మైదానం నిర్మాణం కోసం మంగళవారం హైదరాబాద్‌ నుంచి హెచ్‌సీఏ కమిటీ వచ్చి పరిశీలించింది. రాష్ట్రంలో నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో మాత్రమే హెచ్‌సీఏకు సొంత స్థలాలు ఉన్నాయి. ఇందులో ముందుగా నిజామాబాద్‌లో స్టేడియం పూర్తి చేయడానికి స్థల పరిశీలన, వాటికి కావాల్సిన సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ గురించి హెచ్‌సీఏ కమిటీ పరిశీలించింది. అనంతరం నగరంలోని హోటల్‌ నిఖిల్‌ సాయి ఇంటర్నేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌ మాట్లాడారు. 

గతంలో ఉన్న కమిటీ మూడు, నాలుగు సార్లు ఈ స్థలాన్ని పరిశీలించిందన్నారు. కానీ, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కొత్త హెచ్‌సీఏ కమిటీ ఏర్పడిన తర్వాత అపెక్స్‌ కమిటీ బాడీ ఆమోదం పొందిందన్నారు. ఇన్ఫ్‌స్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ చేసి మరో రెండు నెలల్లో స్టేడియం నిర్మాణ పనులు ప్రారంభిస్తామని, వాటికి కావాల్సిన అత్యవసరమైన డ్రెసింగ్‌ రూమ్స్‌, టాయిలెట్లు, ఫెన్సింగ్‌ పూర్తి చేసిన తర్వాత, మిగతా పనులన్నింటినీ త్వరతగతిన పూర్తి చేస్తామని తెలిపారు. స్టేడియం నిర్మాణానికి కావాల్సిన పూర్తి సహకారం అందించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ స్థలాన్ని పదేండ్ల క్రితమే కొనుగోలు చేశామన్నారు. స్టేడియం పనుల పూర్తికి ఇప్పుడు ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిపారు. 


logo