Mohammad Azharuddin : అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో అదరగొట్టిన భారత పేసర్ మహమ్మద్ సిరాజ్(Mohammed Siraj ) ఫిట్‌నెస్‌పై, అతడు తినే తిండిపై జోరుగా చర్చ నడుస్తోంది. ఐదు టెస్టులు ఆడినప్పటికీ ఏమాత్రం అలసిపోని మియా భాయ్ డైట్ గురించి విదేశీ క్రికెటర్లు సైతం ఆరా తీస్తున్నారు. రెండు రోజుల క్రితం సైతం ఇంగ్లండ్ మాజీ సారథి డేవిడ్ గోవర్ (David Gower) తమ బౌలర్లకు సిరాజ్ తినే ఆహారమే సూచిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం మహమ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin) మాట్లాడుతూ హైదరాబాదీ స్పీడ్‌స్టర్ ఫేవరెట్ ఫుడ్ ఏంటో చెప్పేశాడు.
ఇంగ్లండ్ పర్యటనలో ఒక్క మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకోకుండా ఆడిన బౌలర్ సిరాజే. ప్రతి రోజు.. ప్రతి సెషన్లో అంతే చురుకుగా ఉంటూ రెట్టించిన ఉత్సాహంతో అతడు బౌలింగ్ చేయడంలో ప్రొటీన్ ఫుడ్ (Protein Food) కీలకమని చెబుతున్నాడు అజారుద్దీన్. అంతేకాదు స్పీడ్‌స్టర్ పాదాలు ధ్రుఢంగా ఉండడంలో నల్లిబొక్క బిర్యానీ, పాయ(Paya) పాత్ర ఎంతో ఉందని అంటున్నాడీ వెటరన్.
Mohammed Siraj was outstanding. Thanks to nalli gosht biryani and paya, he has developed a strong body, particularly his legs: Mohammad Azharuddin#MohammedSiraj #ENGvsIND #INDvsENG #MohammadAzharuddin https://t.co/iCJ9UNwIti
— India Today Sports (@ITGDsports) August 12, 2025
‘ఇటీవలే ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌లో సిరాజ్ అద్భుత ప్రదర్శన చేశాడు. అలుపన్నదే ఎరుగకుండా బౌలింగ్ చేసి జట్టును ఆదుకున్నాడు. అందుకు.. నల్లి బొక్క బిర్యానీ (నల్లి ఘోస్త్ బిర్యానీ), పాయకు ధన్యవాదాలు. ఈ రెండూ అతడి ఫేవరెట్ ఫుడ్. ఇవి బాగా తినడం వల్ల అతడి శరీరం ధ్రుఢంగా మారింది. ముఖ్యంగా మియా భాయ్ పాదాలు బలిష్టంగా తయారయ్యాయి. ఓవల్ టెస్టులో సిరాజ్ గొప్పగా బౌలింగ్ చేశాడు. బుమ్రా గైర్హాజరీలో వికెట్లు తీసే బాధ్యత భుజాన వేసుకొని వికెట్ల వేటతో చెలరేగాడు. ఓవల్ మైదానంలో అతడి ప్రదర్శన హైలెట్. జట్టును గెలిపించాలనే కసితో బౌలింగ్ చేసిన అతడు.. ఇంగ్లండ్ బ్యాటర్లకు దడ పుట్టించాడు. భారత క్రికెటలో అతడు కొత్త సూపర్ స్టార్ అని మాజీ కెప్టెన్ హైదరాబాదీ పేస్ గన్ను ఆకాశానికెత్తేశాడు.
మహ్మద్ ఇస్మాయిల్, సిరాజ్
సిరాజ్ డైట్ గురించి అతడి సోదరుడు మహ్మద్ ఇస్మాయిల్ (Mohammed Ismail) ఒక సందర్భంలో ఏం చెప్పాడంటే…? ‘మా సోదరుడు సిరాజ్ ఆహారం విషయంలో చాలా కచ్చితంగా ఉంటాడు. జంక్ ఫుడ్ అస్సలు తినడు. హైదరాబాద్‌లో ఉన్నా సరే బిర్యానీ కూడా అప్పుడప్పుడే తింటాడు. పండుగులు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సిరాజ్ ధమ్ బిర్యానీ రుచి చూస్తాడు. అది కూడా ఇంట్లో వండినదై ఉండాలి. పిజ్జా, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటి జోలికి వెళ్లాడు. తన శరీరాన్ని మంచి ఆకృతిలో ఉంచుకోవడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటిస్తాడు సిరాజ్. డైట్, ఫిట్నెస్.. ఒకదానితో ఒకటి ముడిపడిన ఈ రెండిటి విషయంలో అతడు క్రమశిక్షణను తప్పడు’ అని ఇస్మాయిల్ తన సోదరుడి ఫిట్నెస్ సీక్రెట్ వివరించాడు.
అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీకి ముందు ఎన్నో సందేహాలు.. అవన్నీ పటాపంచలు చేస్తూ సిరీస్ సమం చేసింది టీమిండియా. కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో పేసర్లు అదరగొట్టగా ఆతిథ్య జట్టుకు దిమ్మదిరిగే షాకిచ్చింది. ప్రధాన అస్త్రం బుమ్రా మూడు మ్యాచ్‌లే ఆడగా.. సిరాజ్ బౌలింగ్ యూనిట్‌కు నాయకత్వం వహించాడు. ఓవల్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి చిరస్మరణీయ విజయాన్ని అందించాడీ హైదరాబాదీ. మొత్తంగా 23 వికెట్లు తీసి తన పేస్ పవర్ చూపించాడు సిరాజ్.