కరార (గోల్డ్‌కోస్ట్) : ఆస్ట్రేలియా పర్యటనలో భారత టీ20 జట్టు అదరగొడుతున్నది. సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో బ్యాట్‌తో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా బంతితో మెరిసి కంగారూలపై 48 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని నమోదుచేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అక్షర్ పటేల్ (బ్యాట్‌తో 21*, బంతితో 2/20) ఆల్‌రౌండ్ షో తో సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167కే పరిమితమైంది. వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (39 బంతుల్లో 46, 4 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. మోస్తరు ఛేదనలో ఆసీస్.. 18.2 ఓవర్లలో 119 రన్స్‌కే కుప్పకూలింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (24 బంతుల్లో 30, 4 ఫోర్లు) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో అక్షర్‌తో పాటు వాషింగ్టన్ సుందర్ (3/3) మ్యాజికల్ స్పెల్‌తో ఆసీస్ లోయరార్డర్ పనిపట్టగా వరుణ్ చక్రవర్తి (2/20), శివమ్ దూబే (2/20) తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇరుజట్ల మధ్య సిరీస్ విజేతను నిర్ణయించే ఐదో టీ20 శనివారం (నవంబర్ 8) బ్రిస్బేన్‌లో జరుగుతుంది.
ఛేదించాల్సిన లక్ష్యం కష్టమైనది కానప్పటికీ భారత స్పిన్నర్లు కట్టడి చేయడంతో కంగారూలు తడబాటుకు గురయ్యారు. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై అక్షర్, వరుణ్ చెలరేగడంతో ఆసీస్ ఆటలు సాగలేదు. ఛేదనకు దిగిన ఆ జట్టు పవర్ ప్లేలో ధాటిగానే బాదింది. అర్ష్‌దీప్ రెండో ఓవర్లో షార్ట్ (25) సిక్స్, ఫోర్‌తో రెచ్చిపోగా ఆఖరి బంతికి మార్ష్ ఫోర్ కొట్టడంతో 15 పరుగులొచ్చాయి. షార్ట్.. వరుణ్ బౌలింగ్‌లోనూ ముందుకొచ్చి డీప్ స్కేర్ మీదుగా సిక్స్ కొట్టాడు. అయితే ఐదో ఓవర్లో బంతినందుకున్న అక్షర్.. షార్ట్‌ను వికెట్ల ముందు బలిగొనడంతో ఆసీస్ వికెట్ల పతనం మొదలైంది. వన్‌డౌన్‌లో వచ్చిన ఇంగ్లిస్ (12) బుమ్రా బౌలింగ్‌లో రెండు బౌండరీలతో జోరుమీద కనిపించినా అక్షర్ తన మూడో ఓవర్లో అతడిని క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇక అప్పట్నుంచి ఆసీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. పదో ఓవర్లో సూర్య.. దూబేకు బంతినివ్వగా అతడు వరుస ఓవర్లలో ప్రమాదకర మార్ష్, టిమ్ డేవిడ్ (14)ను పెవిలియన్‌కు పంపి ఆ జట్టును కోలుకోనీయకుండా చేశాడు. ఫిలిప్పీ (10)ని అర్ష్‌దీప్ బోల్తా కొట్టించగా వరుణ్ తన చివరి ఓవర్లో మరో డేంజరస్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (2)ను బౌల్డ్ చేయడంతో ఆసీస్ ఓటమి దాదాపు ఖరారైంది. అప్పటికీ ఆ జట్టు విజయానికి 64 రన్స్ దూరంలో ఉండగా క్రీజులో స్టోయినిస్ (17) ఉండటంతో కంగారూలు గెలుపు మీద ఆశతోనే ఉన్నారు. కానీ 17వ ఓవర్లో వాషింగ్టన్.. వరుస బంతుల్లో స్టోయినిస్, బార్ట్లెట్ను ఔట్ చేసి ఆసీస్ ఓటమిని ఖరారుచేశాడు.
భారత్: 20 ఓవర్లలో 167/8 (గిల్ 46, అభిషేక్ 28, ఎల్లీస్ 21/3, జంపా 3/45);
ఆస్ట్రేలియా: 18.2 ఓవర్లలో 119 ఆలౌట్ (మార్ష్ 30, షార్ట్ 25, సుందర్ 3/3, అక్షర్ 2/20)

మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు అభిషేక్ (21 బంతుల్లో 28, 3 ఫోర్లు, 1 సిక్స్), గిల్ మంచి ఆరంభమే ఇచ్చారు. పవర్ ప్లేలోనే ఈ జోడీ స్కోరుబోర్డును పరుగులు పెట్టించింది. అభిషేక్ తన సహజశైలికి భిన్నంగా ఆడినా గిల్ మాత్రం దూకుడుగా ఆడాడు. అయితే జంపా బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన అభిషేక్.. లాంగాన్‌లో డేవిడ్ చేతికి చిక్కాడు. ఈ క్రమంలో భారత్ మరోసారి ప్రయోగాల పరంపరను కొనసాగిస్తూ ఫస్ట్ డౌన్లో దూబే (22)ను బరిలోకి దించింది. కానీ ఈ ప్రయోగం అంతగా సఫలం కాలేదు. జంపా 11వ ఓవర్లో భారీ సిక్స్ కొట్టిన దూబే.. ఎల్లీస్ 12వ ఓవర్లో బౌల్డ్ అయ్యాడు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడిన గిల్.. ఆ తర్వాత నెమ్మదించడంతో భారత స్కోరు వేగమూ తగ్గింది. ఎల్లీస్ 15వ ఓవర్లో బంతిని తప్పుగా అంచనా వేసిన గిల్ మూల్యం చెల్లించుకున్నాడు. క్రీజులోకి రాగానే జంపా ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో అలరించిన కెప్టెన్ సూర్య (20).. బార్ట్లెట్ ఓవర్లో స్కేర్ లెగ్ బౌండరీ వద్ద డేవిడ్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. జంపా 17వ ఓవర్లో తిలక్ (5), జితేశ్ (3)ను ఔట్ చేశాడు. ఈ క్రమంలో అక్షర్ ధాటిగా ఆడి భారత్‌కు పోరాడే స్కోరును అందించాడు.
2 సొంతగడ్డపై టీ20ల్లో ఆసీస్‌కు ఇది రెండో అత్యల్ప స్కోరు.