Tanveer Sangha : అంతర్జాతీయ మ్యాచ్‌లో అరంగేట్రం(International Debut) చేయాలని ప్రతి క్రికెటర్ కల కంటాడు. ఆ రోజు కోసం ఏళ్ల తరబడి నీరీక్షిస్తారు. అయితే.. డెబ్యుట్ క్యాప్ అందుకున్న రోజు కొందరు ఎలా ఆడుతానో అనే భయంతో ఒత్తిడికి లోనవుతారు. కానీ, ఆస్ట్రేలియా(Australia) యువ స్పిన్నర్ తన్వీర్ సంఘా(Tanveer Sangha) మాత్రం అలా కాదు. జట్టులోకి వచ్చీ రావడంతోనే ‘గెలుపు గుర్రం’ అనిపించుకున్నాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే ఈ లెగ్ స్పిన్నర్ 4 వికెట్లతో అదరగొట్టాడు. అది కూడా బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించే పొట్టి ఫార్మాట్లో. దాంతో ఈ యంగ్‌స్టర్‌పై ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తన్వీర్ సంచలన బౌలింగ్ ప్రదర్శనతో దక్షిణాఫ్రికాతో నిన్న జరిగిన తొలి టీ20లో ఆసీస్ భారీ విజయం సాధించింది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. టీ20ల్లో అరంగ్రేటం చేస్తున్నాడనే విషయం తన్వీర్‌కు మ్యాచ్ రోజు వరకు తెలియదు. అవును.. ఆగస్టు 30న మ్యాచ్ జరిగే రోజు అతడు జిమ్‌లో ఉన్నాడు. సీనియర్ స్పిన్నర్ ఆడం జంపా(Adam Zampa) గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌తో నువ్వు టీ20ల్లో అరంగేట్రం చేస్తున్నావు అని కెప్టెన్ మిచెల్ మార్ష్ అతడితో చెప్పాడు. ఆ క్షణం తన్వీర్ ఒకింత షాక్ అయ్యాడు. ఎందుకంటే.. ఈ ఏడాది అతను ది హండ్రెడ్ లీగ్‌లో 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.
వికెట్ తీసిన తన్వీర్‌ను అభినందిస్తున్న వికెట్ కీపర్ ఇంగ్లిస్
అయితే.. మైదానంలోకి దిగాక ప్రశాంతంగా ఉండి వికెట్ల వేట కొనసాగించాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 226 రన్స్ కొట్టింది. భారీ లక్ష్య ఛేదనలో సఫారీ జట్టును 21 ఏళ్ల తన్వీర్ వణికించాడు. 4 ఓవర్లు వేసి 18 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. దాంతో, దక్షిణాఫ్రికా 115కే కుప్పకూలింది. దాంతో, నాలుగు టీ20 సిరీస్‌లో కంగారు జట్టు 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.