సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఓ క్లబ్ క్రికెటర్ ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. గోల్డ్ కోస్ట్ ప్రీమియర్ లీగ్ డివిజన్లో ముజీరబా నీరంగ్ జిల్లా క్రికెట్ క్లబ్ కెప్టెన్ గారెత్ మోర్గన్(Gareth Morgan) ఆ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. సర్ఫర్స్ ప్యారడైజ్ సీసీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అతను చివరి ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు వికెట్లను పడగొట్టేశాడు. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సర్ఫర్స్ ప్యారడైజ్ జట్టు.. 4 వికెట్లు కోల్పోయి 174 రన్స్ చేసింది. అయితే 40వ ఓవర్లో మోర్గన్ తన బౌలింగ్‌తో ప్రత్యర్థుల్ని వణికించాడు. చివరి ఓవర్లో వేసిన ఆరు బంతుల్లో ఆరుగురిని ఔట్ చేశాడు. దీంతో సర్ఫర్స్ జట్టు 174 రన్స్‌కే ఆలౌటైంది. చివరి అయిదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. మోర్గన్ తన బౌలింగ్‌లో మొదటి నాలుగు బంతుల్లో నలుగుర్ని క్యాచ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత ఇద్దర్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఏడు ఓవర్లు వేసిన మోర్గన్.. 16 రన్స్ ఇచ్చి ఏడు వికెట్లు తీసుకున్నాడు. బ్యాటింగ్‌లోనూ మోర్గన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వేగంగా అతను 39 రన్స్ చేశాడు.