సుదీర్ఘ క్రికెట్ చరిత్రను ఒకసారి నిశితంగా పరిశీలిస్తే.. దిగ్గజ ప్లేయర్లు అద్భుత ఆటతీరుతో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపిస్తూ కలలోకి వచ్చేలా చేశారు. 1998లో సచిన్ టెండూల్కర్, 2003లో రికీ పాంటింగ్, 2016లో విరాట్ కోహ్లీ ఒక ఊపు ఊపారు. ఆకాశమే హద్దు అన్నట్లు చెలరెగుతూ పరుగుల పండగ చేసుకున్నారు. ఈ ముగ్గురు బ్యాటర్లు అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయేది బ్యాటర్లకు దడ పుట్టించిన భారత పేస్‌గన్ జస్ప్రీత్ బుమ్రా గురించి. తాజాగా ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఏకంగా 32 వికెట్లతో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లను అనామకులుగా మార్చుతూ పేస్ పిచ్‌లపై బెబ్బులిలా గర్జించాడు. 2024లో టెస్టుల్లో 71 వికెట్లు పడగొట్టిన బుమ్రా నంబర్‌వన్ బౌలర్‌గా నిలిచాడు.
Jasprit Bumrah | నమస్తే తెలంగాణ క్రీడావిభాగం: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి చెప్పుకోబోయే ముందు రెండు మాటలు పరిశీలించాలి. ఇటీవలే ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా ప్రదర్శనను మనం ప్రత్యక్షంగా చూశాం. బ్యాటర్లు ఘోరంగా విఫలమైన వేళ భారాన్ని మొత్తం తన భుజ స్కంధాలపై మోస్తూ ఆసీస్ గడ్డపై బుమ్రా వికెట్లు నేలకూల్చాడు. ప్రపంచంలోనే వేగవంతమైన పిచ్‌పై పేరుగాంచిన పెర్త్‌లో మొదలైన బుమ్రా వికెట్ల జోరు ఆఖరిదైన సిడ్నీ వరకు దిగ్విజయంగా కొనసాగింది. వేదిక ఏదైనా వికెట్ల వేట విరామం లేకుండా పోయింది. పెర్త్‌లో విజయంతో ముచ్చటగా మూడోసారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ భారత్‌దే అనుకున్నారు. అంతలా బుమ్రా అద్భుత బౌలింగ్ ప్రదర్శన కొనసాగింది.
దిగ్గజాల ప్రశంసలు
ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్.. బుమ్రాపై ప్రశంసలు కురిపిస్తూ ఇలా అన్నాడు. ‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా గనుక లేకపోయింటే సిరీస్ పూర్తిగా ఏకపక్షమయ్యేది. ఆసీస్‌పై బుమ్రా అంతలా ప్రభావం చూపించాడు. నిప్పులు చెరిగే బంతులతో వికెట్లు నేలకూల్చి భారత్‌ను పోటీలోకి తీసుకొచ్చాడు. బుమ్రా లేకపోతే భారత్ ఈ మాత్రం పోటీనైనా ఇచ్చి ఉండేది కాదు. వైవిధ్యమైన యాక్షన్‌తో బంతిని ఇరువైపులా స్వింగ్ చేయడంలో బుమ్రా ఆరితేరాడు. ప్రపంచక్రికెట్లో బుమ్రా ఓ అరుదైన బౌలర్. అతని గురించి ఎంత చెప్పుకున్న తక్కువే’ అని అన్నాడు.
మరోవైపు ఒంటిచేత్తో ఆసీస్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన రికీ పాంటింగ్ స్పందిస్తూ ‘ఇప్పటి వరకు నేను చూసిన అత్యుత్తమ బౌలింగ్ ఇది. సిరీస్‌లో చాలా వరకు పేస్ బౌలర్లకు పిచ్‌లు సహకరించాయి. మిగతా బౌలర్లతో పోలిస్తే బుమ్రా బౌలింగ్ చేస్తున్నప్పుడు బ్యాటింగ్ చేయడం చాలా కష్టమనిపించింది. ఒక రకంగా ఆసీస్ టాపార్డర్ బ్యాటర్లను దాదాపు సిరీస్ మొత్తంగా బుమ్రా అనామకులుగా మార్చేశాడు. అంతలా అతని ప్రభావం కనిపించింది. ఐదు టెస్టుల్లో 13.06 సగటుతో 32 వికెట్లు తీయడమంటే సాధారణ విషయం కాదు’ అని అన్నాడు.
బుమ్రా ది గ్రేట్..
పై రెండు ప్రశంసలు చాలు.. బుమ్రా ఎంతలా భారత జట్టును ముందుకు నడిపించాడో. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ద్వారా బుమ్రా బౌలింగ్‌లో ఎవరెస్ట్ అంత ఎత్తు ఎదిగాడని చెప్పొచ్చు. ఇది కేవలం టెస్టులకే పరిమితం కాలేదు. గతేడాది ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ గెలువడంలోనూ బుమ్రాదే కీలక పాత్ర. 11.8 సగటుతో 15 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు.
ఒక ఏడాదిలో అత్యధిక వికెట్లు
తాజాగా ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో కంగారూలను ముప్పుతిప్పలు పెట్టిన టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం భారత జట్టు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. సిరీస్ ఓటమి కంటే అతడు పూర్తి స్థాయిలో ఎప్పటి వరకు కోలుకుని తిరిగి జట్టుతో కలుస్తాడు..? అన్న దానిపైనే ప్రధానంగా చర్చ సాగుతోంది. వచ్చే నెలలో కీలకమైన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఉన్న నేపథ్యంలో బుమ్రా ఫిట్‌నెస్‌పై ఆందోళన నెలకొంది.
ఈనెల 22 నుంచి ఇంగ్లండ్‌తో మొదలయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కూ బుమ్రా అందుబాటులో ఉండటం అనుమానమే. వెన్నునొప్పి తిరగబెట్టడం(?)తో సిడ్నీ టెస్టు నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న అతడి గాయం తీవ్రతపై పూర్తిస్థాయి స్పష్టత లేదు. ఒకవేళ అతడి గాయం గ్రేడ్- 1 లెవల్లో ఉంటే బుమ్రా పూర్తిస్థాయిలో కోలుకోవడానికి రెండు నుంచి మూడు వారాల సమయం పట్టొచ్చు. అదే గ్రేడ్ – 2 స్థాయిలో ఉంటే ఆరు వారాలు, గ్రేడ్- 3 అయితే కనీసం మూడు నెలలు అవసరం ఉంటుంది.