 
                                                            సిడ్నీ : ఆస్ట్రేలియా క్రికెట్లో మరో విషాదం. 17 ఏండ్ల యువ క్రికెటర్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా బంతి అతడి మెడకు బలంగా తగలడంతో మృతి చెందిన ఘటన ఆస్ట్రేలియా క్రికెట్‌ను విషాదంలో ముంచింది. వివరాల్లోకెళ్తే.. మెల్బోర్న్ లోని ఫ్రెంట్రీ గల్లీ క్రికెట్ క్లబ్‌కు చెందిన బెన్ ఆస్టిన్ ఈనెల 28న స్థానికంగా జరగాల్సిన ఓ టీ20 మ్యాచ్ కోసం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా బౌలర్ వేసిన బంతి అతడి మెడకు బలంగా తాకింది.
ఆస్టిన్ హెల్మెట్ ధరించినా దాని ఇరువైపులా రక్షణలా ఉండే నెక్ గార్డ్ లేకపోవడంతో ప్రమాదం జరిగిన వెంటనే అతడు నొప్పితో విలవిల్లాడుతూ అక్కడే కూలిపోయాడు. సహచర క్రికెటర్లు వెంటనే అతడిని స్థానికంగా ఉన్న దవాఖానకు తరలించినా మృత్యువుతో పోరాడి గురువారం ఉదయం తుదిశ్వాస విడిచాడు. సరిగ్గా 11 ఏండ్ల క్రితం ఆసీస్ క్రికెటర్ ఫిల్ హ్యూస్ సైతం ఇదే తరహాలో మరణించిన విషయం తెలిసిందే. ఆస్టిన్ మృతికి సంతాపంగా మహిళల వన్డే ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్‌లో భారత్, ఆసీస్ క్రికెటర్లు నల్ల రిబ్బన్లు ధరించి నివాళి అర్పించారు.
 
                            