సెయింట్ కిట్స్ : వెస్టిండీస్ పర్యటనను ఆస్ట్రేలియా వరుసగా 8వ విజయంతో ఘనంగా ముగించింది. మూడు టెస్టులు, ఐదు టీ20లు ఆడేందుకు కరీబియన్ గడ్డపై అడుగిడిన ఆసీస్.. టెస్టులను క్లీన్‌స్వీప్ చేయగా తాజాగా టీ20 సిరీస్‌లోనూ ఐదింటికి ఐదూ గెలిచింది. సోమవారం జరిగిన చివరి మ్యాచ్‌లో ప్రత్యర్థికి మొదట బ్యాటింగ్ అప్పగించిన కంగారూలు.. ఆ జట్టు నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని మరో మూడు ఓవర్లు మిగిలుండగానే ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించారు.
ఈ సిరీస్ ఆసాంతం రాణించిన కామెరూన్ గ్రీన్ (32)తో పాటు మిచెల్ ఒవెన్ (37) ధాటిగా ఆడగా ఆఖర్లో ఆరోన్ హార్డీ (28*) మెరుపులతో ఆ జట్టు ఘనవిజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్.. హెట్మెయర్ (52), రూథర్‌ఫర్డ్ (35) రాణించడంతో పోరాడే స్కోరును సాధించింది. మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన డ్వార్షియస్ (3/41)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, గ్రీన్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.