WTC 2023 : అగ్రశ్రేణి ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టింది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టులో భారీ విజయం సాధించిన ఆసీసీ ఫైనల్ బెర్తు ఖాయం చేసుకుంది. దాంతో మూడో టెస్టులో గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు దక్కించుకోవాలన్న టీమిండియాకు షాక్ తగిలింది. అయితే.. అహ్మదాబాద్‌లో జరగనున్న నాలుగో టెస్టులో గెలిస్తే నేరుగా ఫైనల్ చేరే అవకాశం ఉంది. దాంతో, ఆ మ్యాచ్‌పైనే భారత్ ఆశలన్నీపెట్టుకుంది.
భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియాను కచ్చితంగా ఓడించాలి. లేదంటే మూడో స్థానంలో ఉన్న శ్రీలంక ఫైనల్ చేరే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా 68.52 విజయాలు, 148 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. టీమిండియా (60.29 విజయాలు, 123 పాయింట్లు) రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ ఏడాది డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్‌లో ఇంగ్లండ్‌లోని ఓవల్ స్టేడియంలో జరగనుంది. ఐసీసీ మూడేళ్ల క్రితం తొలిసారి నిర్వహించిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.
శ్రీలంక త్వరలోనే న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఒకవేళ ఆ జట్టు 2-0తో కివీస్‌ను ఓడిస్తే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు మెరుగుపడుతాయి. ప్రస్తుతం శ్రీలంక 53.33 శాతం విజయాలు, 64 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ తొలి రెండు టెస్టులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ మూడో టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైంది. వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా ఇండోర్ టెస్టులో చతికిలబడింది. ఆస్ట్రేలియా చేతిలో 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 2012 నవంబర్ తర్వాత సొంత గడ్డపై భారత్‌కు ఇది టెస్టుల్లో తొలి ఓటమి కావడం విశేషం. 76 పరుగుల లక్ష్యంతో మూడో రోజు బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రీలియా తొలి సెషన్లోనే విజయం సాధించింది. మార్నస్ లబుషేన్ (28), ఓపెనర్ ట్రావిస్ హెడ్ (49) ధనాధన్ ఆడి మ్యాచ్ ముగించారు. 11 వికెట్లు తీసిన నాథన్ లియాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ విజయంతో, నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ బోణీ కొట్టింది. భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. అహ్మదాబాద్ స్టేడియంలో మార్చి 9న నాలుగో టెస్టు జరగనుంది.