భారత క్రికెట్ అభిమానులకు ఆదివారం (డిసెంబర్ 8) తీవ్ర నిరాశను మిగిల్చింది. ఒకేరోజు భారత సీనియర్ పురుషుల, మహిళల, జూనియర్ జట్లు ఓటముల పాలై అభిమానులను నిరుత్సాహపరిచాయి. పురుషుల, మహిళల జట్లు ఆస్ట్రేలియా చేతిలో దారుణమైన పరాభవాలను మూటగట్టుకోగా జూనియర్ స్థాయిలో అండర్-19 కుర్రాళ్లూ కీలక ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో చతికిలపడ్డారు. ప్రతిషాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులో రోహిత్ సేనను కంగారూలు 10 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను సమం చేశారు. గత పర్యటనలో సగటు భారత క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేని విషాదాన్ని (36 ఆలౌట్) మిగిల్చిన అడిలైడ్‌లో మరోసారి టీమ్ఇండియాకు నిరాశే ఎదురైంది. ఇదిలాఉంటే అమ్మాయిల పరిస్థితి మరీ దారుణం! భారత బౌలర్లను క్లబ్ స్థాయి బౌలర్లుగా మార్చుతూ ఆ జట్టు బ్యాటర్లు పరుగుల పండుగ చేసుకోవడమే గాక వరుసగా రెండు వన్డేల్లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకున్నారు. ఇక అండర్-19లో బౌలర్లు రాణించి ప్రత్యర్థిని స్వల్ప స్కోరుకే పరిమితం చేసినా బ్యాటర్లు చేతులెత్తేయడంతో బంగ్లాదేశ్ ఆసియా కప్‌ను ఎగురేసుకుపోయింది.
అడిలైడ్: డే అండ్ నైట్ టెస్టులలో తనకు తిరుగేలేదని ఆస్ట్రేలియా మరోసారి నిరూపించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆ జట్టు పది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. గులాబీ బంతులతో ఆడే ఈ టెస్టులలో ఇప్పటిదాకా 13 మ్యాచ్‌లు ఆడితే ఆసీస్‌కు ఇది 12వ విజయం కావడం విశేషం. మ్యాచ్‌పై ఆశలు లేకున్నా నితీశ్ కుమార్ రెడ్డి (42), రిషభ్ పంత్ (28)పై ఆశలు పెట్టుకున్న భారత్.. 175 పరుగులకే కుప్పకూలి ఆసీస్ ఎదుట 19 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. స్వల్ప లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు 3.2 ఓవర్లలోనే వికెట్లేమీ నష్టపోకుండా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. తద్వారా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీతో ఆకట్టుకున్న లోకల్ బాయ్ ట్రావిస్ హెడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సిరీస్‌లో మూడో టెస్టు ప్రతిష్టాత్మక గబ్బా స్టేడియం (బ్రిస్బేన్)లో ఈనెల 14 నుంచి మొదలుకానుంది.
సంచలనాలేమీ లేకుండానే..
రెండో రోజే భారత ఓటమి ఖరారైనా పంత్, నితీశ్ క్రీజులో ఉండటంతో భారత్ కనీసం పోరాడే స్కోరైనా చేయకపోతుందా? అని ఆశించిన అభిమానుల ఆశలపై మిచెల్ స్టార్క్ మూడో రోజు తొలి ఓవర్లోనే నీళ్లు చల్లాడు. ఓవర్ నైట్ స్కోరు (128/5)కు ఒక్క పరుగు కూడా జతకాకుండానే పంత్‌ను ఔట్ చేశాడు. నితీశ్ కొద్దిసేపు పోరాడి ఇన్నింగ్స్ ఓటమి గండం నుంచి తప్పించాడు. రోహిత్, కోహ్లీ, రాహుల్ వంటి హేమాహేమీలు విఫలమైన చోట రెండో టెస్టు మాత్రమే ఆడుతున్న నితీశ్ తెగువ చూపించాడు. నితీశ్‌ను ఆసీస్ సారథి కమిన్స్ 9వ వికెట్‌గా ఔట్ చేయడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. లోయరార్డర్ బ్యాటర్లు అశ్విన్ (7), బుమ్రా (2 నాటౌట్), సిరాజ్ (7) సంచలనాలేమీ నమోదు చేయలేదు. కమిన్స్ (5/57) ఫైఫర్‌తో మెరవగా బొలాండ్ (3/51), స్టార్క్ (2/60) రోహిత్ సేనను నిలువరించారు. స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ ఓపెనర్లు మూడు ఓవర్లలోనే ఊదేశారు.
మూడో స్థానానికి భారత్
అడిలైడ్ ఓటమి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భారత అవకాశాలను మరోసారి దెబ్బతీసింది. తాజా పరాభవంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమ్ఇండియా.. 57.29 శాతంతో మూడో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా 60.71 శాతంతో అగ్రస్థానాన ఉండగా 59.26 శాతంతో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకోవాలంటే భారత్ రాబోయే మూడు టెస్టులలో కనీసం రెండింటిలో అయినా కచ్చితంగా గెలవాల్సి ఉంది.
సంక్షిప్త స్కోర్లు:
భారత్ తొలి ఇన్నింగ్స్: 180 ఆలౌట్;
ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 337 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్: 175 ఆలౌట్ (నితీశ్ 42, పంత్ 28, కమిన్స్ 5/57, బొలాండ్ 3/51);ఆసీస్ రెండో ఇన్నింగ్స్: 19/0 (మెక్‌స్వీని 10, ఖవాజా 9)