లండన్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్పును ఆరుసార్లు విజేత ఆస్ట్రేలియా ఏడోసారి కైవసం చేసుకుంది. ఆదివారం లార్డ్స్ వేదికగా పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ఆసీస్.. 7 వికెట్ల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్‌ను ఓడించి రికార్డుస్థాయిలో ఏడోసారి కప్పును ముద్దాడింది. ముందు బంతితో ఇంగ్లిష్ జట్టును కట్టడిచేసిన కంగారూలు.. తర్వాత బ్యాట్‌తో రెచ్చిపోయి ఆడారు. ప్రత్యర్థి నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యాన్ని మోలినో సేన.. 17.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది. బెత్ మూనీ (49 బంతుల్లో 10 ఫోర్లతో 64), ఫొబె లిచ్‌ఫీల్డ్ (35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) దూకుడుగా ఆడారు. అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. ఆసీస్ బౌలర్లు కట్టడిచేయడంతో నిర్ణీత ఓవర్లలో 150/4కే పరిమితమైంది. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (53 బంతుల్లో 5 ఫోర్లతో 58 నాటౌట్) అర్ధ శతకంతో జట్టును ఆదుకోగా ఫ్రెయా కెంప్ (28 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 44 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరును సాధించింది. కాగా టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఆసీస్ చేతిలో ఓడటం ఇంగ్లండ్‌కు ఇది నాలుగో (2012, 2014, 2018 తర్వాత)వది కావడం గమనార్హం. 2009 తర్వాత రెండోసారి టైటిల్ సాధించాలన్న ఇంగ్లండ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.
ముందు నిలువరించి.. ఆపై దంచికొట్టి..
టోర్నీలో అపజయమన్నదే లేకుండా ఫైనల్ చేరిన ఆతిథ్య జట్టుకు ఫైనల్లో తిప్పలు తప్పలేదు. ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో ఆరంభం నుంచే ప్రత్యర్థిని కట్టడిచేసి సీవర్ సేనను పుంజుకోకుండా నిలువరించారు. పది ఓవర్లకు 67 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆ జట్టును కెప్టెన్ ఆదుకున్నా ఆమె ఆశించిన స్థాయిలో విజృంభించకపోవడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేయలేకపోయింది. ప్రత్యర్థిని నిలువరించిన అదే పిచ్‌పై కంగారూలు రెచ్చిపోయారు. ఓపెనర్ జార్జియా వోల్ (9) నిరాశపరిచినా వేగంగా ఆడిన మూనీ, లిచ్‌ఫీల్డ్ జోడీ రెండో వికెట్‌కు 67 బంతుల్లోనే 100 రన్స్ జతచేసింది. విజయానికి చేరువగా వచ్చాక ఈ ద్వయం నిష్క్రమించినా గార్డ్నర్తో కలిసి పెర్రీ (13 నాటౌట్) లాంఛనాన్ని పూర్తిచేసింది.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్: 20 ఓవర్లకు 150/4 (సీవర్ 58*, కెంప్ 44*, హమిల్టన్ 1/19, గార్త్ 1/20)’ ఆస్ట్రేలియా: 17.1 ఓవర్లకు 153/3 (మూనీ 64, లిచ్‌ఫీల్డ్ 48, ఎకిల్‌స్టోన్ 1/17, డీన్ 1/28)