విశాఖపట్నం : మహిళల ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా బంతితో విఫలమైనా బ్యాట్‌తో దుమ్మురేపింది. ఇరుజట్ల మధ్య వైజాగ్‌లో భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో ఆసీస్.. 3 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. ఆ జట్టు సారథి అలిస్సా హీలి (107 బంతుల్లో 142, 21 ఫోర్లు, 3 సిక్స్‌లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో భారత్ నిర్దేశించిన 331 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 49 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి ఛేదించింది. హీలి వీరవిహారానికి తోడు ఎల్లీస్ పెర్రీ (52 బంతుల్లో 47 నాటౌట్, 5 ఫోర్లు, 1 సిక్స్), గార్డ్నర్ (45), లిచ్‌ఫీల్డ్ (40) ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ హీలి బాదుడుతో భారత బౌలర్లు భారీగా పరుగులిచ్చుకున్నారు.
శ్రీచరణి (3/41) మినహా మిగిలిన బౌలర్లంతా తేలిపోయారు. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. స్మతి మంధాన (66 బంతుల్లో 80, 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), ప్రతీక రావల్ (96 బంతుల్లో 75, 10 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో 48.5 ఓవర్లలో 330 రన్స్‌కు ఆలౌట్ అయింది. హర్లీన్ (38), జెమీమా (33), రిచా (32) ఫర్వాలేదనిపించారు. గత మూడు మ్యాచ్‌లతో పోలిస్తే ఆసీస్‌తో భారత టాపార్డర్ మెరుగ్గా రాణించి భారీ స్కోరు సాధించినా బౌలింగ్ వైఫల్యంతో ఉమెన్ ఇన్ బ్లూకు ఓటమి తప్పలేదు. ఈ టోర్నీలో టీమ్ఇండియాకు ఇది రెండో పరాభవం కాగా మూడు విజయాలతో ఏడు పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను వచ్చే ఆదివారం ఇంగ్లండ్‌తో తలపడనుంది.
భారీ ఛేదనను ఆసీస్ దూకుడుగానే ఆరంభించింది. ఓపెనర్లు లిచ్‌ఫీల్డ్, హీలి ఆరంభం నుంచే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. లిచ్‌ఫీల్డ్ ఓవర్‌కు ఓ ఫోర్కు తగ్గకుండా ఆడితే క్రాంతి వేసిన 8వ ఓవర్లో హీలి.. 6,4, 4, 4తో 19 రన్స్ రాబట్టింది. అమన్‌జోత్ పదో ఓవర్లో లిచ్‌ఫీల్డ్ నాలుగు బౌండరీలు బాదింది. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 85 పరుగులు జోడించారు. అయితే 12వ ఓవర్లో బంతినందుకున్న చరణి.. లిచ్ఫల్డ్ను ఔట్ చేసినా ఆసీస్ జోరు తగ్గలేదు. పెర్రీతో కలిసి రెండో వికెట్‌కు హీలి 83 రన్స్ జోడించి రిటైర్డ హర్ట్‌గా వెనుదిరిగింది.. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన హీలి.. తర్వాత మరింత దూకుడు పెంచింది. మూనీ (4), అన్నాబెల్ (0) స్వల్ప వ్యవధిలోనే నిష్క్రమించినా గార్డ్నర్ రాకతో ఆసీస్ స్కోరువేగం మరింత పెరిగింది. స్నేహ్ రాణా బౌలింగ్‌లో సింగిల్‌తో 84 బంతుల్లోనే హీలి శతకం పూర్తైంది. సెంచరీ తర్వాత తన వీరవిహారాన్ని ఆమె మరో స్థాయికి తీసుకెళ్లింది. నాలుగో వికెట్‌కు గార్డ్నర్తో కలిసి పది ఓవర్లలోనే 95 రన్స్ జోడించాక ఎట్టకేలకు చరణి బౌలింగ్‌లో రాణా అద్బుత క్యాచ్ అందుకోవడంతో ఆమె ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత వరుస ఓవర్లలో మెక్‌గ్రాత్ (12), గార్డ్నర్, మొలినెక్స్ (18) నిష్క్రమించడంతో భారత్‌కు గెలుపు ఆశలు చిగురించాయి. కానీ మళ్లీ క్రీజులోకొచ్చిన పెర్రీ.. గార్త్ (14*)తో కలిసి ఆసీస్ గెలుపు లాంఛనాన్ని పూర్తిచేసింది.
01
భారత్: 48.5 ఓవర్లలో 330 ఆలౌట్ (స్మృతి 80, రావల్ 75, అన్నాబెల్ 5/40, మొలినెక్స్ 3/75);
ఆస్ట్రేలియా: 49 ఓవర్లలో 331/7 (హీలి 142, పెర్రీ 47*, చరణి 3/41, దీప్తి 2/52)
1 మహిళల వన్డే చరిత్రలో ఇది రికార్డు లక్ష్య ఛేదన