ముంబై: బ్యాటర్లు సత్తాచాటినా.. బౌలర్లు రాణించలేకపోవడంతో ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన పోరులో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో ఆసీస్ చేతిలో ఓడింది. మొదట మన అమ్మాయిలు 50 ఓవర్లలో 8 వికెట్లకు 282 పరుగులు చేశారు.
జెమీమా రోడ్రిగ్స్ (77 బంతుల్లో 82; 7 ఫోర్లు), పూజ వస్ర్తాకర్ (46 బంతుల్లో 62 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), యస్తిక భాటియా (49) అదరగొట్టారు. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్నర్, జార్జియా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. లిచ్‌ఫీల్డ్ (78), ఎలీసా పెర్రీ (75), తహిలా మెక్‌గ్రాత్ (68 నాటౌట్) అర్ధశతకాలు సాధించారు. ఇరు జట్ల మధ్య శనివారం రెండో వన్డే జరగనుంది.