AUS vs WI 1st Test: స్వదేశంలో వెస్టిండీస్‌తో అడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయానికి చేరువవువతోంది. విండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకే ఆలౌట్ చేసిన కంగారూలు.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు పడగొట్టారు. ప్రధాన బ్యాటర్లంతా పెవిలియన్ చేరడంతో ఇక ఏదైనా అద్బుతం జరిగితే తప్ప విండీస్ ఓటమి లాంఛనమే. అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 81.1 ఓవర్లలో 283 పరుగులకే ఆలౌట్ అయింది.
ఓవర్ నైట్ స్కోరు 59/2తో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ కూడా తడబడింది. వెంటవెంటనే కామెరూన్ గ్రీన్ (14), ఉస్మాన్ ఖవాజా (45), మిచెల్ మార్ష్ (5) ల వికెట్లను కోల్పోయింది. కానీ ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (134 బంతుల్లో 119, 12 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. లోయరార్డర్ బ్యాటర్ల సాయంతో హెడ్.. ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 95 పరుగుల ఆధిక్యం అందించాడు. విండీస్ పేసర్, ఈ టెస్టుతో అరంగేట్రం చేసిన షెమర్ జోసెఫ్ (5/94) ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు.
Five-wicket haul on Test debut for Shamar Joseph 👊#WTC25 | #AUSvWI pic.twitter.com/vTRwGWplmR
— ICC (@ICC) January 18, 2024
అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన విండీస్‌ను హెజిల్వుడ్ వణికించాడు. అతడు వరుస ఓవర్లలో తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ (0), కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (1) , అలిక్ అథనేజ్ (0), కవెమ్ హోడ్జ్ (3) లను పెవిలియన్ చేర్చాడు. దీంతో విండీస్.. 19 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన క్రిక్ మెకంజీ (26), జస్టిన్ గ్రీవ్స్ (24)లు విండీస్‌ను ఆదుకున్నారు. కానీ మెకంజీని గ్రీన్ ఔట్ చేయగా గ్రీవ్స్‌ను లియాన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో విండీస్.. ఆరు వికెట్లను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు ఉన్న ఆధిక్యం కంటే విండీస్ ఇంకా 22 పరుగులు వెనుకబడే ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ టెస్టులో మూడో రోజు లంచ్ వరకే ఫలితం తేలే అవకాశముంది.