AUS vs NED | వన్డే వరల్డ్ కప్‌లో ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. నెదర్లాండ్స్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న 24వ లీగ్ మ్యాచ్‌లో ఆసీస్ ధాటిగా ఆడుతోంది. స్టీమ్ స్మిత్‌తో పాటు ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 68 బంతుల్లోనే 9 బౌండరీలు ఒక భారీ సిక్సర్ సాయంతో స్మిత్ 71 పరుగులు సాధించాడు. మరోవైపు గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన డేవిడ్ వార్నర్.. ఈ మ్యాచ్‌లో కూడా శతకం దిశగా సాగుతున్నాడు. 26 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్.. రెండు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.
ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో శతకంతో వీరబాదుడు బాదిన మిచెల్ మార్ష్ (9) నేటి మ్యాచ్‌లో మాత్రం విఫలమయ్యాడు. తొలి వికెట్‌కు వార్నర్ – మార్ష్‌లు 28 పరుగులు జోడించారు.
అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్.. వాన్ మీకెరెన్ వేసిన ఏడో వర్లో రెండు బౌండరీలు బాదాడు. వాన్ బీక్ వేసిన పదో ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలు కొట్టాడు. స్మిత్‌తో పాటు వార్నర్ కూడా నిలకడగా ఆడటంతో కంగారూల స్కోరుబోర్డు పరుగులెత్తింది. విక్రమ్‌జిత్ సింగ్ వేసిన 18వ ఓవర్లో వార్నర్ సిక్స్, ఫోర్ బాది 40 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఆ మరుసటి ఓవర్లోనే స్మిత్ కూడా 48 బంతుల్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. వన్డే ప్రపంచకప్‌లలో స్మిత్‌కు ఇది 9వ అర్థ సెంచరీ. బాస్ డీ లీడె వేసిన 23వ ఓవర్లో స్మిత్.. సిక్స్, ఫోర్‌తో 70లలోకి చేరాడు. కానీ ఆర్యన్ దత్ వేసిన 24వ ఓవర్లో మూడో బంతికి వాన్ డెర్ మెర్వ్ చేతికి చిక్కాడు. దీంతో వార్నర్‌తో కలిసి స్మిత్.. 132 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 26 ఓవర్ల ఆట ముగిసేసమయానికి వార్నర్ (80 నాటౌట్), లబూషేన్ (10 నాటౌట్) లు ఆడుతున్నారు.