అద్భుతం ఆవిష్కృతమైంది. హైదరాబాద్ ఘన చరిత్రలో మరో కలికుతురాయి చేరింది. రాష్ట్ర ప్రభుత్వ అవిరళ కృషితో చిరకాల కల సాకారమైంది. భారత్‌లో తొలిసారి మన భాగ్యనగరం ఆతిథ్యమిచ్చిన ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్‌షిప్ అట్టహాసంగా ముగిసింది. 11 జట్లకు చెందిన 22 మంది రేసర్లు హోరాహోరీగా పోరాడిన హైదరాబాద్-ఈ ప్రిలో జాన్ ఎరిక్ వెర్న్ టైటిల్‌తో తళుక్కుమన్నాడు. ఆఖరి క్షణం వరకు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన తుదిపోరులో సహచర రేసర్లను వెనుకకు నెడుతూ జాన్ చిరస్మరణీయ విజయంతో ఆకట్టుకున్నాడు.
33 ల్యాప్‌ల రేసులో డీఎస్ పెన్స్కే రేసర్ జాన్ తనదైన జోరు ప్రదర్శించాడు. ఫార్ములా-ఈ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్..విజేత జాన్‌కు ట్రోఫీ అందించారు. 25వేల మంది అభిమానులు తరలివచ్చిన వేళ హుసేన్సాగర్ తీర ప్రాంతం కొత్త కళ సంతరించుకుంది. సినీతారలు, క్రికెటర్లు, ప్రముఖుల తళుకుబెళుకులు హైదరాబాద్ ఫార్ములా-ఈ రేసింగ్‌కు ఎక్కడలేని వన్నె తెచ్చాయి. మొత్తంగా ‘హ్యాపెనింగ్ హైదరాబాద్’లో మరో అంతర్జాతీయ ఈవెంట్ అభిమానుల మదిలో చిరకాలం గుర్తుండి పోవడం ఖాయం.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ తొలిసారి ఆతిథ్యమిచ్చిన ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ ప్రపంచ రేసింగ్ చాంపియన్‌షిప్ ఘనంగా ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం, గ్రీన్కో సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఫార్ములా-ఈ రేసుకు తెరపడింది. శనివారం ఫ్రీ ప్రాక్టీస్, క్వాలిఫయింగ్, ప్రధాన రేసుతో హుసేన్సాగర్ తీర ప్రాంతం ఫార్ములా-ఈ కార్ల రేసింగ్‌తో ఊగిపోయింది. అంతర్జాతీయ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు దాదాపు 25వేల మంది సాగరతీరానికి తరలివచ్చారు.
ఉదయం 8.05 గంటలకు ఫ్రీ ప్రాక్టీస్ రేసుతో మొదలైన రేసింగ్ జోరు సాయంత్రం 4.30కు ముగిసింది. పోటీల ముగింపు కార్యక్రమానికి ఫార్ములా-ఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ సులేయమ్, కోఫౌండర్ అల్బర్టో లాంగో, సీఈవో జామీ రీగల్తో పాటు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఎలాంటి అవాంతరాలు లేకుండా రేసు సాఫీగా జరిగింది.
ప్రధాన రేసు జరుగుతున్న సమయంలో కార్లు ఒకటికి ఒకటి ఢీ కొనడం మినహా పెద్దగా చెప్పుకోదగ్గ ప్రమాదాలు చోటు చేసుకోలేదు. రేసు విషయానికొస్తే హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్లో భాగంగా సాగర తీరాన్ని ఆనుకుని ప్రత్యేకంగా నిర్మించిన 2.8కి.మీల ట్రాక్‌పై ప్రపంచ ప్రసిద్ధ రేసర్లు కార్లను టాప్‌గేర్‌లో నడిపారు. ఫ్రీ ప్రాక్టీస్, క్వాలిఫయింగ్, మెయిన్..రేసు ఏదైనా దూసుకెళ్లడమే లక్ష్యంగా కార్లను పరుగులు పెట్టించారు.
హోరాహోరీగా ఫైనల్ పోరు
టైటిల్ దక్కించుకోవాలన్న కసితో రేసర్లందరూ ఫైనల్ పోరులోకి దిగారు. మధ్యాహ్నం 3.00 గంటలకు మొదలైన రేసు దాదాపు గంట సేపు కొనసాగింది. షెడ్యూల్ ప్రకారం మొత్తం 32 ల్యాపుల్లో రేసు జరుగాల్సి ఉన్నా..ఆఖర్లో ఒకింత అవాంతరం చోటు చేసుకోవడంతో మరో ల్యాప్‌ను అదనంగా చేర్చారు. రేసు ఇలా మొదలైందో లేదో కార్లు ఒక్కసారిగా దుమ్ములేపుతూ ట్రాక్‌పై దూసుకెళ్లాయి. రేసు సాఫీగా సాగుతున్న క్రమంలో 13వ ల్యాప్‌లో మూడో పాయింట్ వద్ద టీసీఎస్ జాగ్వర్ రేసర్ సామ్ బర్డ్ తమ కంపెనీకే చెందిన మిచ్ ఇవాన్స్ కారును ఢీకొట్టాడు. దీంతో ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ కారణంగా నాలుగు కార్లు తమ గతి తప్పాయి. వెంటనే తేరుకున్న రేసర్లు అప్పటికప్పుడు పుంజుకుని రేసులోకి దూసుకురాగా, టీసీఎస్ రేసర్లు పోటీ నుంచి తప్పుకున్నారు. ఇదిలా ఉంటే డీఎస్ పెన్స్కేకు చెందిన జాన్ ఎరిక్ ల్యాప్ ల్యాప్నకు ప్రత్యర్థులకు సవాలు విసురుతూ ముందుకు సాగాడు. ఈ క్రమంలో బ్యాటరీని తెలివిగా వినియోగిస్తూ కీలక మలుపుల్లో ఓవర్టేకింగ్తో ముందంజ వేశాడు.
ఆఖరి ల్యాప్ వరకు జాన్, నిక్ మధ్య గెలుపు దోబూచులాడింది. అయితే కొన్ని సెకన్ల వ్యవధిలో జాన్..చెకర్డ్ ఫ్లాగ్‌ను దాటుకుంటూ టైటిల్‌ను సొంతం చేసుకోగా, నిక్కు నిరాశే ఎదురైంది. అప్పటి వరకు మూడో స్థానంలో ఎన్విజన్ రేసింగ్ డ్రైవన్ సెబాస్టియన్ బుమీ ఓవర్‌పవర్ వాడి 17 సెకన్ల పెనాల్టీతో 15వ స్థానానికి పడిపోయాడు. సెబాస్టియన్ డీ కోస్టాకు మూడో స్థానం దక్కింది. మొత్తంగా సీజన్-7 తర్వాత జీన్‌కు ఇది తొలి పోడియం ఫినిష్ కావడం విశేషం.
రేసు సాగింది ఇలా
తొలుత ఫ్రీ ప్రాక్టీస్‌తో మొదలైన రేసు ఆ తర్వాత క్వాలిఫయింగ్ దశకు చేరుకుంది. ఈ క్రమంలో జట్లు జోడీగా తలపడ్డాయి. ప్రతీ రేసు రసవత్తరంగా సాగింది. రేసు రేసుకు డ్రైవర్లు జోరు పెంచుతూ ముందుకు సాగారు. డ్యూయల్ దశలో తొలుత ఎనిమిది మంది డ్రైవర్లు క్వార్టర్స్‌కు అర్హత సాధించారు. ఆ తర్వాత ల్యాప్ టైమింగ్‌ను లెక్కిస్తూ ముగ్గురు రేసర్లు సెమీస్‌లో నిలువగా, మిగిలిన ఐదుగురు నిష్క్రమించారు. ఆఖరిదైన ఫైనల్లో టీసీఎస్ జాగ్వర్కు చెందిన మిచ్ ఇవాన్స్, డీఎస్ ఆటోమోబైల్స్ రేసర్ జీన్ ఎరిక్ వెర్నె టాప్-2లో నిలిచారు. అయితే క్వాలిఫయింగ్ రేసులో మిచ్ ఇవాన్స్‌కు పోల్ పొజిషన్ దక్కగా, రెండు, మూడు స్థానాల నుంచి వరుసగా జీన్, సెబాస్టియన్ బుమీ(ఎన్విజన్ రేసింగ్) రేసును షురూ చేశారు.
పోడియం పైకి మళ్లీ రావడం చాలా సంతోషంగా ఉంది. రేసు ఆఖరి వరకు హోరాహోరీగా సాగింది. ఈ విజయం నాకు ఎంతో కీలకమైంది. ఏడో సీజన్ తర్వాత ఇది తొలి గెలుపు. రేసులో నేను ఎలాంటి తప్పులు చేయకపోవడం కలిసి వచ్చింది. ఈ రేసు కచ్చితంగా క్లిష్టమైంది. టైటిల్ గెలిచినా…మేము ఇంకా మెరుగుపడాల్సి ఉంది. ఇలాంటి విజయాలతో ఇంకా మెరుగుపడే అవకాశం లభిస్తుంది. కొత్త ట్రాక్‌లను నేను ఇష్టపడుతా. ఈ సర్యూట్‌లో రేసింగ్‌ను ఆస్వాదించాను.
– జాన్ ఎరిక్- హైదరాబాద్ , ఫార్ములా ప్రి విజేత
హైదరాబాద్ వాసులకు ‘ఈ’రేసు వీక్షించే అవకాశం కల్పించిన రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌పై ప్రశంసల వర్షం కురుస్తున్నది. ప్రతిష్ఠాత్మక ‘ఫార్ములా-ఈ రేసింగ్ చాంపియన్‌షిప్’ఆతిథ్యానికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడినా.. కేటీఆర్ క్రేజ్, ప్రభుత్వ నిబద్ధత, పాలనా దక్షత, రాష్ట్రంలో ఈవీ రంగానికి అందిస్తున్న ప్రోత్సాహం, ఫ్రెండ్లీ విధానాలతో ఈ అవకాశం హైదరాబాద్‌కు దక్కింది. కేటీఆర్ విజన్ వల్లే హుసేన్ సాగర్ తీరంలో అద్భుతం ఆవిష్కృతమైందని ఫార్ములా-ఈ కో ఫౌండర్ అల్బెర్టో లోంగో ప్రశంసించగా.. వినూత్న ఆలోచనలు, విభిన్న ఆవిష్కరణలకు కేటీఆర్ సదా అండగా నిలుస్తారని చీఫ్ బిజినెస్ గ్రోత్ ఆఫీసర్ మమతా చామర్తి పేర్కొన్నారు.