కాప్రా, అక్టోబర్ 2: ఆసియా క్రీడల్లో కాంస్య పతకం నెగ్గిన అగసర నందిని ఇంట్లో సంబురాలు అంబరాన్ని అంటాయి. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్ మహిళల హెప్టాథ్లాన్ పోటీల్లో నందిని కాంస్యం సాధించి రాష్ర్టానికి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన నందినిపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. కాప్రా చంద్రపురి కాలనీలోని నందిని నివాసంలో పండుగ వాతావరణం నెలకొంది. జాతీయ క్రీడల్లో ఎన్నో పతకాలు సాధించిన నందిని అంతర్జాతీయ స్థాయిలో మెరవడంతో కాలనీవాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ.. నందిని తల్లిదండ్రులు అయ్యమ్మ, ఎల్లప్పను అభినందించారు.