Asian Games | ఆసియాగేమ్స్‌లో భారత ఆర్చర్లు దుమ్మురేపుతున్నారు. తమ గురికి తిరుగులేదన్న రీతిలో పతకాలు కొల్లగొడుతున్నారు. మహిళల, పురుషుల కాంపౌండ్ ఈవెంట్లలో కొరియా, చైనా, జపాన్ ఆర్చర్లను వెనుకకు నెడుతూ పసిడి వెలుగులు విరజిమ్మారు. తెలుగమ్మాయి వెన్నెం జ్యోతిసురేఖ, అదితి స్వామి, పర్నీత్‌కౌర్ త్రయం స్వర్ణం ఖాతాలో వేసుకోగా, అభిషేక్‌వర్మ, ఒజాస్, ప్రతమేశ్ పసిడి ముద్దాడారు. స్కాష్‌లో మన ప్లేయర్లు స్వర్ణ, రజతాలు దక్కించుకోగా, పురుషుల సింగిల్స్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన ప్రణయ్ సంచలనం సృష్టించాడు. ప్రత్యర్థిని మట్టికరిపిస్తూ అంతిమ్ పంగల్ కంచు మోత మోగించింది. మొత్తంగా పోటీల 12వ రోజు భారత్‌కు మూడు స్వర్ణాలు సహా రజతం, కాంస్యం దక్కాయి.
హాంగ్జౌ: ఆసియాగేమ్స్ ముగియడానికి వస్తున్నా భారత ప్లేయర్ల పతక జోరు టాప్‌గేర్‌లో దూసుకెళుతున్నది. నిన్న, మొన్నటి వరకు అథ్లెట్లు పతకాల పంట పండించగా, తాజాగా తమ వంతు అన్నట్లు ఆర్చర్లు రెచ్చిపోతున్నారు. తమకు బాగా అచ్చొచ్చిన కాంపౌండ్ ఈవెంట్లో తిరుగులేదని చాటిచెబుతూ మరో రెండు పసిడి పతకాలను ఖాతాలో వేసుకున్నారు. తొలుత మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో జ్యోతిసురేఖ, అదితి గోపీచంద్, పర్నీత్కౌర్తో కూడిన భారత త్రయం 230-229తేడాతో చైనీస్ తైపీ జట్టుపై అద్భుత విజయం సాధించింది. ముగ్గురికి ముగ్గురు చెక్కుచెదరని గురితో పాయింట్లు కొల్లగొడుతూ పోయారు. ఓవైపు చైనీస్ తైపీ ఆర్చర్లు దీటుగా పోటీనిచ్చినా పది పాయింట్లకు తగ్గకుండా రౌండ్ రౌండ్‌కు తమ ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయారు. మరోవైపు పురుషుల కాంపౌండ్ టీమ్‌ఈవెంట్‌లో అభిషేక్‌వర్మ, ఒజాస్ దేవ్‌తలె, పార్థమేశ్ జాక్వర్ త్రయం 235-230తో దక్షిణకొరియా ఆర్చర్లపై చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తంగా మూడు కాంపౌండ్ ఈవెంట్లలో భారత ఆర్చర్లు పసిడి పతకాలు కొల్లగొట్టి ఔరా అనిపించారు. ఆసియాడ్‌లో మన ఆర్చర్లకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.
స్కాష్‌లో భారత్ డబుల్ ధమాకాతో అదరగొట్టింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో దీపికా పల్లికల్, హరిందర్‌పాల్‌సింగ్ జోడీ 11-10, 11-10తో మలేషియా ద్వయం అజ్మాన్, మహమ్మద్ కమాల్‌పై విజయంతో పసిడి ఒడిసిపట్టుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ ఫైనల్లో సౌరవ్ ఘోశల్ 1-3తో ఎయిన్ యో(మలేషియా) చేతిలో ఓడి రజత పతకం దక్కించుకున్నాడు.
ఆసియా క్రీడల్లో పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళల హాకీ జట్టు ఆశలు గల్లంతయ్యాయి. గురువారం జరిగిన సెమీఫైనల్లో సవితా పూనియా బృందం చైనా చేతిలో 0-4తో చిత్తుగా ఓడిపోయింది. చైనా ఆటగాళ్లను నిలువరించేందుకు భారత డిఫెండర్లు ఎంతో ప్రయత్నించినా లాభం లేకపోయింది. జియాఖి ఘాంగ్ 25వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌తో చైనాకు తొలి గోల్ అందించింది. ఆ తర్వాత వరుసగా మీరాంగ్ జౌ (40వ నిమిషం), మేయు లియాంగ్ (55వ నిమిషం), బింగ్ఫెంగ్ గు(60వ నిమిషం)లో గోల్స్ చేశారు. భారత జట్టు చైనా గోల్‌పోస్ట్‌పై పలుమార్లు దాడి చేసినా విజయవంతం కాలేకపోయింది. కాంస్య పతకం కోసం భారత్ రెండో సెమీఫైనల్లో ఓడిన జట్టును ఢీ కొననుంది.
కబడ్డీలో భారత పురుషుల జట్టు వరుసగా నాలుగు విజయాలతో సెమీస్‌లో అడుగుపెట్టి ంది.భారత్ గురువారం 50-27తో చైనీస్ తైపీని ఓడించి పాకిస్థాన్‌తో పోరుకు సిద్ధమైంది.
మహిళల రెజ్లింగ్‌లో యువ సంచలనం అంతిమ్ పంగల్ కాంస్యంతో మెరిసింది. 19 ఏళ్ల అంతిమ్ 53 కిలోల విభాగంలో ఒలింపిక్ విజేత, మంగోలియా రెజ్లర్ బొలొర్తుయా బాట్ ఒచిర్‌ను 3-1తో చిత్తు చేసింది. క్వార్టర్స్‌లో జపాన్ క్రీడాకారిణి అకారి ఫుజినమి చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన అంతిమ్ కాంస్య పతక పోరులో అదరగొట్టింది. మంగోలియా రెజ్లర్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పతకం కొల్లగొట్టింది.
భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ ఆసియా క్రీడల్లో ప్రభంజనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లి 41 ఏండ్లుగా ఊరిస్తున్న పతకం కొరత తీర్చాడు. 78 నిమిషాల పాటు ఉత్కంఠగా సాగిన క్వార్టర్స్‌లో ప్రణయ్ మలేషియాకు చెందిన లీ జీ జియాపై 21-16, 21-23, 22-20తో గెలుపొందాడు. దాంతో, 41ఏండ్ల తర్వాత పురుషుల సింగిల్స్ సెమీస్‌కు చేరిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 1982లో ఢిల్లీ జరిగిన పోటీల్లో సయ్యద్ మోడీ కాంస్యం గెలిచాడు. ఇప్పుడు ప్రణయ్ అతడి రికార్డును బ్రేక్ చేయనున్నాడు. ఫైనల్ బెర్తు కోసం ప్రణయ్ చైనాకు చెందిన లీ షీ ఫెంగ్‌తో తలపడనున్నాడు. డబుల్స్‌లో జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి సింగపూర్ ద్వయంపై 21-7, 21-9తో అవలీలగా గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టారు. తద్వారా పురుషుల డబుల్స్‌లో పతకం గెలిచిన రెండో భారత జంటగా సాత్విక్ – చిరాగ్ గుర్తింపు సాధించనున్నారు. 41 ఏండ్ల్ల క్రితం.. 1982లో లెరోయ్ డిసా, ప్రదీప్ గంధే జోడీ కాంస్యం గెలిచింది. ఇక ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా గెలవని పీవీ సింధు క్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టింది.