ఢాకా: స్టార్ డ్రాగ్ ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ డబుల్ గోల్స్‌తో రెచ్చిపోవడంతో ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ 3-1తో పాకిస్థాన్‌ను చిత్తుచేసింది. గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారీ విజయం సాధించిన మన్‌ప్రీత్‌సింగ్ సేన.. ఈ గెలుపుతో సెమీఫైనల్‌కు మరింత చేరువైంది. శుక్రవారం జరిగిన కీలక పోరులో హర్మన్‌ప్రీత్ సింగ్ (8వ, 53వ నిమిషాల్లో) రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచగా.. ఆకాశ్‌దీప్ సింగ్ (42వ ని.లో) ఫీల్డ్‌గోల్‌తో అదుర్స్ అనిపించాడు. పాకిస్థాన్ తరఫున జునైద్ మంజూర్ (45వ ని.లో) ఏకైక గోల్ సాధించాడు. మూడు మ్యాచ్‌లాడి ఏడు పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్.. ఆదివారం చివరి రౌండ్ రాబిన్ మ్యాచ్‌లో జపాన్‌తో తలపడనుంది. మస్కట్ వేదికగా 2018లో జరిగిన చివరి ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ ఉమ్మడి విజేతలుగా నిలువగా.. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి ఫుల్ జోష్‌లో ఉన్న టీమ్ఇండియా ఈసారి పాక్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది.
మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడు కొనసాగించిన భారత్ 8వ నిమిషంలో బోణీ కొట్టింది. తొలి పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని హర్మన్‌ప్రీత్ సద్వినియోగం చేసుకోవడంతో భారత్ ఖాతా తెరిచింది. మరో నాలుగు నిమిషాల తర్వాత మన్‌ప్రీత్ కొట్టిన షాట్‌ను పాకిస్థాన్ గోల్‌కీపర్ అబ్బాస్ అద్వితీయంగా అడ్డుకున్నాడు. రెండో క్వార్టర్లో భారత్ దాడుల తీవ్రత పెంచినా.. పాక్ రక్షణ శ్రేణి వాటిని సమర్థంగా అడ్డుకుంది. మూడో క్వార్టర్లో ఆకాశ్‌దీప్ గోల్ కొట్టడంతో భారత్ ఆధిక్యం డబుల్ కాగా.. కాసేపటికి పాకిస్థాన్ తొలి గోల్ నమోదు చేసింది. ఇక చివరి క్వార్టర్లో వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ గోల్‌గా మలచడంతో భారత్ విజయం ఖాయమైంది. మ్యాచ్ తొలి అర్ధభాగంలో బంతి పాకిస్థాన్ గోల్‌పోస్ట్ చుట్టూనే తిరిగిందంటే.. భారత్ ఆధిపత్యం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.