Asia Cup | భారత మాజీ దిగ్గజ బ్యాట్స్‌మెన్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ ఆసియా కప్-2025 కోసం తనకు ఇష్టమైన 11 మంది సభ్యులతో జట్టును ప్రకటించాడు. ఆయన జట్టులో పలువురి ఆటగాళ్ల పేర్లు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. హిట్టర్లకు చోటు కల్పించలేదు. గవాస్కర్ టీమ్ క్రికెట్ అభిమానులతో పాటు పండితులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. గవాస్కర్ ప్లేయింగ్-11లో అనుభవం, కొత్తవారికి పెద్దపీట వేశారు. టాప్ ఆర్డర్లో దూకుడుగా ఆడే బ్యాట్స్‌మెన్ ఉన్నప్పటికీ.. బౌలింగ్ లైనప్‌లో వైవిధ్యం కనిపించింది. సంజు శాంసన్‌కు గవార్కర్ ప్లేయింగ్-11లో ఓపెనింగ్ నుంచి తప్పించి.. ఆ బాధ్యతలను అభిషేక్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు అప్పగించారు. తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ బాధ్యతలను అప్పగించారు.
అయితే, గవాస్కర్ ఐదోస్థానంలో శాంసన్‌కు వికెట్ కీపర్‌గా బాధ్యతలు అప్పగించి అందరికీ షాక్ ఇచ్చారు. జితేష్ శర్మను గవాస్కర్ జట్టులో చోటివ్వలేదు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌లను ఆల్ రౌండర్ల కేటగిరిలో ఎంపిక చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జట్టులో ఇద్దరు స్పెషలిస్ట్ స్పినర్లకు ఛాన్స్ ఇచ్చారు. ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలను జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లకు, స్పిన్ బాధ్యతలను కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలకు అప్పగించారు. గవాస్కర్ జట్టులో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు స్పినర్లతో సమతూకంగా ఉంది. దాంతో పాటు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ సైతం పార్ట్‌టైమ్ స్పిన్ బౌలింగ్ చేయగల నైపుణ్యం ఉంది. అయితే, గవాస్కర్ తన జట్టులో నలుగురు ఆటగాళ్లకు అవకాశం ఇవ్వలేదు. శివం దుబే, జితేష్ శర్మ, హర్షిత్ రాణా, రింకు సింగ్ వంటి ఆటగాళ్లకు అవకాశం ఇవ్వలేదు. జట్టులో సీనియర్, యువ ఆటగాళ్లకు సమతూకంతో జట్టును ఎంపిక చేసేందుకు గవాస్కర్ ప్రయత్నించారు.
అభిషేక్ శర్మ
శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్)
తిలక్ వర్మ
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్)
సంజు శాంసన్ (వికెట్ కీపర్)
హార్దిక్ పాండ్యా
అక్షర్ పటేల్
అర్ష్‌దీప్ సింగ్
జస్ప్రీత్ బుమ్రా
వరుణ్ చక్రవర్తి
కుల్దీప్ యాదవ్
ఈ ఏడాది ఆసియా కప్ సెప్టెంబర్ 9న మొదలుకానున్నది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరుగనున్నది. ఈ ఏడాది యూఏఈ వేదికగా ఆసియా కప్ జరుగనున్నది. టోర్నీ టీ20 ఫార్మాట్లో నిర్వహించడనుండడం విశేషం. ఈ టోర్నీ కోసం ఇప్పటికే భారత్, పాకిస్తాన్‌తో పాటు పలు జట్లు తమ టీమ్‌లను ప్రకటించాయి. సెప్టెంబర్ 10న యూఏఈతో జరిగే మ్యాచ్‌తో భారత్ ఆసియా కప్‌ను ప్రారంభిస్తుంది. అదే సమయంలో భారత్-పాకిస్తాన్ మధ్య గ్రూప్ మ్యాచ్ ఆదివారం (సెప్టెంబర్ 14) దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగనున్నది. టోర్నమెంట్లో భారత్, పాక్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ 21న జరిగే సూపర్ 4 మ్యాచ్‌లలో మళ్లీ రెండు జట్లు తలపడే అవకాశం ఉంది. గ్రూప్ దశలో భారత్ మూడో మ్యాచ్‌ను ఒమన్‌తో ఆడుతుంది.