Asia Cup Controversy | ఆసియా కప్ ముగిసి దాదాపు ఆరువారాలు గడిచింది. ఇంకా ట్రోఫీని ఏసీసీ భారత జట్టుకు అప్పగించలేదు. సెప్టెంబర్ 28న సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో పాక్‌ను ఐదు వికెట్ల తేడాత ఓడించి.. తొమ్మిదోసారి ఆసియా కప్ టైటిల్‌ను సాధించింది. అయితే, మ్యాచ్ తర్వాత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నది. క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేశాయి. పీసీబీ చైర్మన్, పాక్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని అందుకునేందుకు భారత జట్టు నిరాకరించింది.
దాంతో ఏసీసీ అధ్యక్షుడుగా నఖ్వీ తానే ట్రోఫీని ఇస్తానని భీష్మించారు. టీమిండియా అందుకు నిరాకరించడంతో ఆయన ట్రోఫీని హోటల్‌కు తీసుకు వెళ్లడం వివాదాస్పదమైంది. అయితే, నఖ్వీ ద్వంద్వ పాత్ర వివాదానికి దారి తీసింది. టెలికాం ఆసియా స్పోర్ట్స్‌లోని ఓ నివేదిక ప్రకారం.. దుబాయిలో జరుగనున్న ఐసీసీ క్రికెట్ బోర్డు సమావేశంలో బీసీసీఐ మొత్తం సమస్యను లేవనెత్తబోతున్నది. మొహ్సిన్ నఖ్వీపై ఆరోపణల జాబితాను బీసీసీఐ సిద్ధం చేసింది. ఆయన అనర్హతను ప్రశ్నించే తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతోందని నివేదిక పేర్కొంది. ప్రభుత్వ పదవి, క్రీడా పరిపాలన పదవి రెండింటిని ఒకేసారి కలిగి ఉండడం ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించడమేనని బీసీసీఐ పేర్కొంటున్నది.
అయితే, ఆసియా కప్ ట్రోఫీ అప్పగింతపై ఇంకా పరిస్థితి అస్పష్టంగానే ఉన్నది. ఈ విషయంపై ఇప్పటికే ఏసీసీకి అధికారిక లేఖ పంపామని.. ఇప్పటి వరకు స్పందన రాలేదని బీసీసీఐ దేవజిత్ సైకియా ఇటీవల వెల్లడించారు. శుక్రవారం జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో బీసీసీఐ అధికారికంగా ఈ విషయాన్ని లేవనెత్తుతుందని పలు నివేదికలు తెలిపాయి. ట్రోఫీని పంపడంలో ఆలస్యంపై బోర్డు తీవ్రంగా పరిగణిస్తున్నది. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని.. సంస్థాగత పారదర్శకతకు విరుద్ధంగా ఉందని సైకియా పేర్కొన్నారు. పాకిస్తాన్ సైనిక చర్యలు ముగ్గురు ఆఫ్ఘన్ దేశీయ క్రికెటర్లు మరణించిన తర్వాత పాక్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు ఇటీవల క్షీణించాయి. తర్వాత పాక్‌లో జరుగనున్న ముక్కోణపు సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ వైదొలిగింది.
ఆసియా కప్ ముగిసిన తర్వాత భారత జట్టు మైదానంలోనే ఉండిపోయింది. కప్ లేకుండానే సంబరాలు చేసుకుంది. ట్రోఫీని అందించేందుకు నఖ్వీ వేదికపై చేరుకున్న సమయంలో భారత ఆటగాళ్లు స్పందించలేదు. దాంతో నఖ్వీ ట్రోఫీతో హోటల్‌కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత టీమిండియా ట్రోఫీ, మెడల్స్ లేకుండానే భారత్‌కు వచ్చింది. ఇలా జరుగడం క్రికెట్ చరిత్రలోనే తొలిసారి. భారత్-పాక్ క్రికెట్ సంబంధాలు మరింత దెబ్బతీయడమే కాకుండా.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా ఐసీసీ బోర్డు సమావేశం జరుగుతుండడంతో బీసీసీఐ అధికారికంగా ఈ సమస్యను లేవనెత్తనున్నది. ఈ అంశం ఆసియా కప్ ట్రోఫీని తిరిగి ఇవ్వడంతో పాటు మొహ్సిన్ నఖ్వీ ద్వంద పాత్రలపై సైతం దృష్టి సారించే అవకాశం ఉంది. ఐసీసీ తీవ్రంగా పరిగణిస్తే రాబోయే రోజుల్లో ఏసీసీలో కీలక మార్పులు జరుగనున్నాయి.