ఆసియాకప్‌లో శ్రీలంక సిక్సర్ కొట్టింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన లంక.. మ్యాచ్ మ్యాచ్‌కు మెరుగవుతూ ఆరోసారి చాంపియన్‌గా అవతరించింది. తుదిపోరులో మొదట తడబడ్డా.. భానుక రాజపక్స కీలక ఇన్నింగ్స్ ఆడటంతో భారీ స్కోరు చేసిన లంకేయులు.. ఆ తర్వాత క్రమశిక్షణాయుత బౌలింగ్‌తో పాకిస్థాన్‌ను కట్టడి చేశారు.
దుబాయ్: ఆర్థిక సంక్షభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక.. ఆసియాకప్‌లో విజేతగా నిలిచింది. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన లంకేయులు అంచనాలకు మించి రాణించి కప్పు కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో లంక 23 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. భానుక రాజపక్స (45 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. కుషాల్ మెండిస్ (0), ధనుష్క గుణతిలక (1), దసున్ షనక (2), నిసాంక (8), ధనంజయ డిసిల్వ (28) విఫలమవడంతో ఒక దశలో లంక 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో భానుక తన కెరీర్లోనే అత్యుత్తమం అనదగ్గ ఇన్నింగ్స్‌తో విజృంభించాడు.
అతడికి వణిండు హసరంగ (36; 5 ఫోర్లు, ఒక సిక్సర్), చమిక కరుణరత్నె (14 నాటౌట్) చక్కటి సహకారం అందించారు. పాక్ బౌలర్లలో హరీస్ రవుఫ్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్థాన్ 20 ఓవర్లలో147 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ (55) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. ఇఫ్తిఖార్ (32), రవుఫ్ (13) మినహా తక్కినవాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. లంక బౌలర్లలో ప్రమోద్ 4, హసరంగ మూడు వికెట్లు పడగొట్టారు. పాక్ విజయానికి 24 బంతుల్లో 61 పరుగులు అవసరమైన దశలో.. 17వ ఓవర్ వేసిన హసరంగ.. రిజ్వాన్ సహా మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. భానుకకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, హసరంగకు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక: 20 ఓవర్లలో 170/6 (భానుక రాజపక్స 71 నాటౌట్, హసరంగ 36; రవుఫ్ 3/29),
పాకిస్థాన్: 20 ఓవర్లలో 147 ఆలౌట్ (రిజ్వాన్ 55, ఇఫ్తిఖార్ 32; ప్రమోద్ 4/34, హసరంగ 3/27).