Ashwin : ఐపీఎల్లో విజయంతమైన బౌలర్లు చాలామందే ఉన్నా రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) మాత్రం ప్రత్యేకం. స్పిన్ ఆల్‌రౌండర్‌గా ప్రత్యర్థులను వణికించిన యశ్.. రెండుసార్లు ఐపీఎల్ ట్రోఫీ అందుకున్నాడు. క్యారమ్ బాల్స్‌తో ఇబ్బందిపెట్టే యశ్ అంటే కొందరు బ్యాటర్లకు హడల్. ఈ మిస్టరీ స్పిన్నర్ బంతి అందుకున్నాడంటే వికెట్ కాపాడుకునేందుకు నానాతంటాలు పడేవాళ్లు.
అశ్విన్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక అత్యధిక సార్లు వికెట్ సమర్పించుకున్నవాళ్లలో రాబిన్ ఊతప్ప (Robin Uthappa) అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు ఏకంగా ఏడు సార్లు ఔటయ్యాడు. అజింక్యా రహానే(Ajinkya Rahane)ను ఆరు పర్యాయాలు పెవిలియన్ పంపాడు అశ్విన్. అంబటి రాయుడు, విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్ ఐదుసార్లు అశ్విన్ ఓవర్లో వెనుదిరిగారు. క్వింటన్ డికాక్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, పార్థివ్ పటేల్ నాలుగోసారి అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యారు.
క్రిస్ గేల్, రహానే, ఊతప్ప
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి అందరినీ ఆశ్చర్యపరిచిన రవిచంద్రన్ అశ్విన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి వైదొలిగి మరో షాకిచ్చాడు. కనీసం ఐపీఎల్‌లోనైనా అతడిని చూడొచ్చు అనుకున్న అభిమానులను అవాక్కయ్యేలా చేశాడు. 19వ సీజన్‌కు ముందు తనను అట్టిపెట్టుకుంటారా? వదిలేస్తారా? అని చెన్నై సూపర్ కింగ్స్ నుంచి స్పష్టత కోరిన అశ్విన్ హఠాత్తుగా వీడ్కోలు బాంబ్ పేల్చాడు.
అయితే.. విదేశీ టీ20 లీగ్స్‌లో ఆడేందుకే ఈ స్పిన్ దిగ్గజం రిటైర్మె్ంట్ ప్రకటించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్ వేదికగా జరిగే ‘ది హండ్రెడ్ లీగ్’పై(The Hundred League) యశ్ ఆసక్తి చూపిస్తున్నాడట. అదే జరిగితే ఈ టోర్నీలో ఆడిన మొదటి భారతీయుడిగా అశ్విన్ చరిత్ర సృష్టిస్తాడు. ఐపీఎల్లో 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఐదు ఫ్రాంచైజీలకు ఆడాడీ లెజెండరీ బౌలర్. తన స్పిన్ మ్యాజిక్‌తో187 వికెట్లు తీసి ఈ లీగ్‌లో ఐదో అత్యధిక వికెట్ల వీరుడిగా రికార్డు నెలకొల్పాడీ తమిళ తంబీ.