చెన్నై: తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్)లో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీరు వివాదాస్పదమైంది. టీఎన్‌పీఎల్‌లో భాగంగా ఐడ్రీమ్ తిర్పూర్ తమిజాన్స్తో కొయంబత్తూర్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దుండిగల్ డ్రాగన్స్ తరఫున బరిలోకి దిగిన అశ్విన్ తాను ఔటైన తీరుపై తీవ్ర అసహనానికి లోనయ్యాడు. సాయి కిషోర్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ప్యాడిల్ స్వీప్ చేయబోయిన అశ్విన్‌ను మహిళా అంపైర్ క్రితికా వెంకటేశన్ ఔట్‌గా ప్రకటించింది.
లెగ్‌సైడ్ వెళుతున్న బంతికి ఎల్బీడబ్ల్యూ ఎలా ఇస్తారంటూ అంపైర్‌తో అశ్విన్ వాగ్వాదానికి దిగాడు. ఇవన్నీ ఏం పట్టించుకోని క్రితిక తన నిర్ణయానికి కట్టుబడుతూ అలాగే ఉండిపోయింది. దీంతో మరింత చిర్రెత్తిపోయిన అశ్విన్.. ప్యాడ్లను బ్యాట్‌తో బలంగా కొడుతూ గ్లౌవ్స్‌ను డగౌట్ వైపు విసిరి వేయడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. మహిళా అంపైర్‌తో అశ్విన్ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శల పాలు అవుతున్నది.