Ashwin – Bhuvaneshwar : భారత జట్టు సీనియర్ ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్(Ravichnadran Ashwin), భువనేశ్వర్ కుమార్(Bhuvaneshwar Kumar) టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికే ఆలోచనతో ఉన్నారు. గత కొంత కాలంగా పొట్టి ఫార్మాట్లో అవకాశాలు దక్కించుకోలేకపోతున్న ఈ ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించాలనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తోంది. నిరుడు టీ20 ప్రపంచ కప్(T20 World Cup)లో ఆడిన అశ్విన్ ఈ ఏడాది టీమిండియా తరఫున ఒక్క టీ20 కూడా ఆడలేదు.
భువనేశ్వర్ కుడా గత నవంబర్ తర్వాత జాతీయ జట్టులో కనిపించలేదు. దీంతో, ఆగస్టులో మొదలయ్యే ఐర్లాండ్ సిరీస్(Ireland Series)కు జట్టును ప్రకటించిన అనంతరం వీరిద్దరూ టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అశ్విన్ టీమిండియా తరఫున 65 టీ20లు ఆడి 72 వికెట్లు పడగొడితే.. భువీ 87 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ కప్ తర్వాత సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(rohit sharma) కూడా పొట్టి ఫార్మాట్‌కు దూరంగానే ఉంటున్నారు. అయితే.. వచ్చే ఏడాదే పొట్టి ప్రపంచ కప్‌లో వీరి భవిష్యత్తుపై స్పష్టత లేకుండా పోయింది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ
ముఖ్యంగా ఫిట్నెస్ పరంగా పాతికేండ్ల కుర్రాడిని సైతం పక్కకు నెట్ట గల కోహ్లీ.. ఈ ఫార్మాట్లోనూ మరింతకాలం కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాకిస్థాన్‌పై విరాట్ ఆడిన (82 నాటౌట్) విధ్వంసక ఇన్నింగ్స్‌ను ఇప్పట్లో అభిమానులు మరిచిపోలేరంటే అతిశయోక్తి కాదు.
భారత జట్టు వెస్టిండీస్ పర్యటన తర్వాత ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. కరీబియన్లతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం అజిత్ అగార్కర్(Ajit Agarkar) నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ ఇప్పటికే జట్టును ప్రకటించింది. ఇందులో రెగ్యులర్ ప్లేయర్లకు విశ్రాంతినిచ్చి.. ఎక్కువ శాతం యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇచ్చింది.
హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ
దీంతో హైదరాబాదీ కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ(Tilak Verma) తొలిసారి భారత జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. వచ్చే నెలలో జరుగనున్న ఐర్లాండ్ సిరీస్‌కు కూడా త్వరలోనే జట్టును ప్రకటించనున్నారు. ఈసారి కూడా యువ ఆటగాళ్లకే పెద్ద పీట వేసే చాన్స్‌లు ఉన్నాయి.