లండన్: మరో మూడు నెలల్లో అగ్రశ్రేణి క్రికెట్ జైట్లెన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగబోయే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఆసీస్ 5-0తో క్లీన్‌స్వీప్ చేస్తుందని ఆ జట్టు దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది నవంబర్ 21 నుంచి మొదలుకానున్న ఈ సిరీస్ కోసం ఇరు జట్ల అభిమానులే గాక ప్రపంచవ్యాప్తంగా టెస్టు క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సందర్భంగా మెక్‌గ్రాత్ బీబీసీ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ఒక జట్టు జయాపజయాలపై అంచనా వేయడం ఇదే మొదటిసారి. ఈసారి మేం (ఆసీస్) 5-0తో క్లీన్ స్వీప్ చేస్తాం. మా జట్టుపై నాకు పూర్తి నమ్మకముంది. కమిన్స్ నేతృత్వంలోని జట్టులో స్టార్క్, హేజిల్‌వుడ్, లియన్ వంటి మేటి బౌలర్లు ఉండగా స్వదేశంలో వాళ్లు ఎలా చెలరేగుతారో నాకు తెలుసు.
వీళ్లను తట్టుకుని నిలబడటం ఇంగ్లండ్‌కు కత్తిమీద సామే. అదీగాక ఇంగ్లండ్ ట్రాక్ రికార్డు కూడా ఇక్కడ గొప్పగా ఏమీ లేదు. సిరీస్ గెలవడం గురించి పక్కనబెడితే వాళ్లు కనీసం ఇక్కడ ఒక మ్యాచ్ గెలిస్తే అదే గొప్ప’ అని అన్నాడు. 2015 నుంచి యాషెస్‌ను గెలుచుకోని ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించి సుమారు పుష్కరకాలం గడిచిపోయింది. 2010-11 సీజన్లో ఇంగ్లండ్ 3-1తో యాషెస్ గెలిచిన తర్వాత ఆ జట్టుకు వరుస పర్యటనల్లో పరాభవాలే ఎదురయ్యాయి.