డే అండ్ నైట్ టెస్టుల్లో మూడు సెంచరీలు నమోదు చేసిన తొలి క్రికెటర్‌గా లబుషేన్ రికార్డుల్లోకెక్కాడు.
అడిలైడ్: మార్నస్ లబుషేన్ (103) రికార్డు శతకానికి స్టీవ్ స్మిత్ (93), అలెక్స్ కారీ (51) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లు తోడవడంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ రెండో టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు బిగించింది. ఓవర్‌నైట్ స్కోరు 221/2తో శుక్రవారం ఆట కొనసాగించిన ఆసీస్ 473/9 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. డే అండ్ నైట్ టెస్టుల్లో మూడు సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా లబుషేన్ చరిత్రకెక్కగా.. సారథ్య పగ్గాలు అందుకున్నాక స్మిత్ చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో పేసర్ స్టార్క్ (39 నాటౌట్), అరంగేట్ర ఆటగాడు నెసెర్ (35) వేగంగా పరుగులు రాబట్టారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 3, అండర్సన్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 17 పరుగులు చేసింది. చేతిలో 8 వికెట్లు ఉన్న ఇంగ్లిష్ జట్టు.. కంగారూల స్కోరుకు ఇంకా 456 పరుగులు వెనుకబడి ఉంది. హమీద్ (6) బర్న్స్ (4) ఔట్ కాగా.. కెప్టెన్ జో రూట్ (5), డేవిడ్ మలన్(1) క్రీజులో ఉన్నారు.
ఆస్ట్రేలియా జట్టు ఇప్పటి వరకు ఎనిమిది డే అండ్ నైట్ మ్యాచ్‌లాడగా.. వాటన్నింటిలోనూ కంగారూలనే విజయం వరించింది. ఇవన్నీ సొంతగడ్డపైనే జరుగడం గమనార్హం. మరోవైపు గులాబీ టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్‌లో 300 పైచిలుకు స్కోరు చేసిన జట్లు ఓటమి పాలైన దాఖలాలు లేకపోవడంతో ఈ మ్యాచ్‌లోనూ ఆసీస్ విజయం దాదాపు ఖాయంగానే కనిపిస్తున్నది. ఇప్పటికే ఓపెనర్లను కోల్పోయిన ఇంగ్లండ్.. శనివారం కంగారూ పేసర్లను ఎలా ఎదుర్కుంటుందో చూడాలి. వాతావరణం అనుకూలించకపోవడంతో రెండో రోజు ఆట నిర్ణీత సమయం కంటే ముందే ముగిసింది.