అర్జెంటీనా సాకర్ స్టార్ లియోనల్ మెస్సీ ‘గోట్’ షో ఆదిలోనే ఊరించి ఉసూరుమనిపించింది. కోల్‌కతాలో మెస్సీ పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయగా, హైదరాబాద్ షో.. సోసోగా సాగింది. కోల్‌కతా ఘటన దృష్టిలో పెట్టుకున్న నిర్వాహకులు హైదరాబాద్‌లో అది పునరావృతం కాకుండా అభిమానులపై తీవ్ర ఆంక్షలు విధించారు. చిన్నా, పెద్ద లేకుండా తమ అభిమాన ఆటగాన్ని ప్రత్యక్షంగా చూద్దామనుకున్న ఫ్యాన్స్‌ను ఇబ్బందులకు గురిచేశారు. వాటర్బాల్స్ను స్టేడియంలోకి తీసుకురాకుండా అడ్డుకున్న నిర్వహకులు కనీసం ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఊదరగొట్టిన దానికి పూర్తిగా భిన్నంగా మెస్సీ హైదరాబాద్ పర్యటన కొనసాగింది. స్టేడియం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల పేరిట అభిమానులను విసిగించారు. సీఎం రేవంత్‌రెడ్డి వన్ మ్యాన్ షోతో సహచర మంత్రులు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్‌లో అర్జెంటీనా సాకర్ స్టార్ లియోనల్ మెస్సీ షో అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. శనివారం ఉదయం కోల్‌కతాలో జరిగిన ఘటన ఇంకా కండ్ల ముందు కదలాడుతుండానే హైదరాబాద్‌లో అడుగుపెట్టిన మెస్సీ తొలుత శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లాడు. అక్కడ ఎంపిక చేసిన కొద్ది మంది(ఒక్క ఫొటోకు రూ.10 లక్షలు) అతిథులతో కలిసి ఫొటోలు దిగారు. ఆ తర్వాత రాత్రి 7 నుంచి 7.30 ప్రాంతంలో ఉప్పల్ స్టేడియానికి మెస్సీ చేరుకోవడానికి ముందు మ్యూజికల్ కన్సర్ట్ ఏర్పాటు చేశారు. అభిమానులను అలరించేందుకు గాను టాలీవుడ్ ప్రముఖ సింగర్లు రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు మంగ్లీతో పాటలు పాడించారు. ఆ తర్వాత లేజర్ షోలో మొదట మెస్సీ చిత్రం కనిపించగానే స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. మెస్సీ తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫొటో ప్రత్యక్షం కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. రాహుల్‌ను అనుసరిస్తూ ఆఖరికి రేవంత్‌రెడ్డి ఫొటోతో లేజర్ షో ముగిసింది.

నిర్ణీత షెడ్యూల్ కంటే ఆలస్యంగా రాత్రి 7.50కు ఎగ్జిబిషన్ మ్యాచ్ మొదలైంది. 7 సైడ్‌తో ఓవైపు సింగరేణి ఆర్ఆర్-9, మరోవైపు మెస్సీ టీమ్ బరిలోకి దిగింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన ఆర్ఆర్-9 టీమ్‌కు సింగరేణి సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరించింది. మ్యాచ్‌లో సాధారణ ఫుట్‌బాల్ మైదానానికి భిన్నంగా అందులో సగం ఉండేలా విధంగా డిజైన్ చేశారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలోని పిచ్‌లను దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులు చిన్న సైజుకు పరిమితమయ్యారు. మొదట కొద్దిసేపు బాలబాలికలు తమ ఫుట్‌బాల్ స్కిల్స్‌తో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో ఆర్ఆర్ టీమ్ 3-0 ఆధిక్యం ప్రదర్శించింది. మ్యాచ్ మొదలైన కొద్దిసేపటికి రేవంత్‌రెడ్డి మైదానంలోకి రాగా, మెస్సీ మాత్రం స్టేడియం డగౌట్లోనే ఉండిపోయాడు. ఇది గమనించిన అభిమానులు మెస్సీ మెస్సీ అంటూ అరిచారు.
ఫ్యాన్స్ సందడితో మెస్సీ మైదానంలోకి రాగా, పిల్లలతో కలిసి తనదైన శైలిలో బంతిని డ్రిబ్లింగ్ చేస్తూ ఆకట్టుకున్నాడు. మొదట ప్రచారం చేసినట్లు రేవంత్‌తో మెస్సీ ఆడుతాడన్న దాన్ని అబద్దమని నిరూపిస్తూ సహచర ప్లేయర్లు లూయిస్, రోడ్రిగోతో కలిసి బంతిని స్టాండ్లలోకి కిక్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ కుష్ అయ్యారు. దీంతో రేవంత్, మెస్సీ కలిసి ఆడేది లేకుండానే మ్యాచ్ ముగిసింది. ఆ తర్వాత జరిగిన పెనాల్టీ షూటౌట్లోనూ రేవంత్ గోల్ కొట్టినా..మెస్సీ అంతగా ఆసక్తి కనబర్చలేదు. నిర్వాహకుల ఒత్తిడి మేరకు మైదానంలో ఒక్కో దగ్గర కొద్దిసేపు పిల్లలతో కలిసి మెస్సీ సరదాగా ఆడి ఫొటోలకు ఫోజిచ్చాడు. ఈ క్రమంలో తన మనువడితో రేవంత్ సాకర్ ఆడించే ప్రయత్నం చేశారు.
సాయంత్రం స్టేడియంలో మెస్సీ షో మొదలయ్యే వరకు మీడియాకు పాస్‌ల విషయంలో తీవ్ర సందిగ్ధత కొనసాగింది. అసలు పాస్‌ల విషయంలో ఎవరిని సంప్రదించాలో తెలియక అటు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు తలలు పట్టుకున్నారు. మెస్సీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రచారం విషయంలో పట్టపగ్గాలు లేకుండా వ్యవహరించిన ప్రభుత్వం మీడియా ప్రతినిధులకు పాస్‌లు ఇవ్వలేకపోయింది. పాస్‌ల కోసం అటు సీఎంవోతో పాటు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్)ను సంప్రదించినా లాభం లేకపోయింది. మాకేం సంబంధం లేదన్నట్లు వారు వ్యవహరించిన తీరు మీడియా ప్రతినిధులకు ఆగ్రహం తెప్పించింది. చివరికి మూడు గంటల నిరీక్షణ తర్వాత నిర్వాహకులు ఇచ్చిన వెండర్ పాస్‌లతో స్టేడియంలోకి ప్రవేశించాల్సి వచ్చింది. ఇన్నేండ్లలో ఉప్పల్ స్టేడియంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొలేదని పలువురు మీడియా ప్రతినిధులు వాపోవడం కొసమెరుపు.
మెస్సీ షో జరిగిన ఉప్పల్ స్టేడియం స్టాండ్లు ఖాళీగా కనిపించాయి. భారీ సంఖ్యలో జనం వస్తారని నిర్వాహకులు వేసిన అంచనాలు పూర్తిగా తలకింద్రులు అయ్యాయి. చాలా వరకు స్టేడియంలోని స్టాండ్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో లేకపోవడంతో చాలా సేపు పూర్తి స్థాయి ఫ్లడ్‌లైట్లు లేకుండానే కార్యక్రమాన్ని కొనసాగించారు.
మీడియా ప్రతినిధులకు ఇచ్చే పాస్‌లు గులాబీ రంగులో ఉన్నాయన్న కారణంగా దూరం పెట్టినట్లు తెలిసింది. రాచకొండ కమిషనరేట్‌కు చెందిన ఒక పోలీస్ ఉన్నతాధికారి ఈ విషయం గమనించి పాస్‌లు మొత్తం తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో చేసేదేమి లేక నిర్వాహకులు తలలు పట్టుకున్నారు. ఇటు మీడియా వాళ్లకు సమాధానం చెప్పలేక..అటు పోలీసుల ఒత్తిళ్లు భరించలేక సతమతమయ్యారు. మొత్తంగా మెస్సీ ఈవెంట్‌తో రాష్ర్టానికి ఏదో ఒరుగుతుంది అన్న దాన్ని ప్రభుత్వం పటాపంచలు చేసింది. రేవంత్‌రెడ్డి వన్‌మ్యాన్ షోతో స్టేడియానికి వచ్చిన మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్ కనీసం మెస్సీని కలువకుండానే నిరాశగా వెనుదిరిగారు. మెస్సీతో కలిసి ఫొటో దిగేందుకు మంత్రులు ప్రయత్నించినా భద్రతా సిబ్బంది వారించడంతో అక్కడితోనే సంతృప్తి పడ్డారు. చివరికి క్రీడా మంత్రి శ్రీహరికి మెస్సీతో కలిసే ఫొటో దిగే చాన్స్ లభించడం కొసమెరుపు.