అంటాల్య (టర్కీ): ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3లో భారత ఆర్చర్ల వైఫల్య ప్రదర్శన కొనసాగుతున్నది. కాంపౌండ్, రికర్వ్ టీమ్ ఈవెంట్స్‌లో నిరాశపరిచిన మన ఆర్చర్లు.. కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలోనూ తేలిపోయారు. శుక్రవారం జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత క్వార్టర్స్‌లో మధుర ధమన్గోంకర్.. 152-159తో మెక్సికో ఆర్చర్ మరియన బెర్నల్ చేతిలో ఓడింది.
వరల్డ్ చాంపియన్ అదితి స్వామి 147-152తో మెక్సికోకు చెందిన రెండో సీడ్ ఆండ్రియా బెకెర్రా గురి ముందు తేలిపోయింది. పురుషుల విభాగంలో 13వ సీడ్ రిషభ్.. 149-157తో ఫ్రాన్స్ విలుకాడు నికోలస్‌కు తలవంచాడు. ఒజాస్.. 157-161తో జేమ్స్ లుట్జ్ (అమెరికా) చేతిలో ఓడాడు. గత నెలలో షాంఘైలో ముగిసిన ప్రపంచకప్ స్టేజ్-2 పతకాల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన భారత్.. అంటాల్యలో మాత్రం ఇంత వరకూ బోణీ కొట్టలేదు. ఈ నేపథ్యంలో శనివారం జరుగనున్న రికర్వ్ ఆర్చర్ల మీదే భారత్ ఆశలు పెట్టుకుంది.