మూలపాడు(ఆంధ్రప్రదేశ్) : భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వయ్ అదరగొడుతున్నాడు. తండ్రికి తగ్గ తనయుడని నిరూపిస్తూ విజయ్ మర్చంట్ ట్రోఫీలో జార్ఖండ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కర్నాటక తరఫున బరిలోకి దిగిన అన్వయ్(153 బంతుల్లో 100 నాటౌట్, 10ఫోర్లు, 2సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. అన్వయ్ విజృంభణతో కర్నాటక 123.3 ఓవర్లలో 441/4 స్కోరు చేసింది. ఈ క్రమంలో మూడో వికెట్‌కు అనిరుధ్(76)తో కలిసి అన్వయ్ 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు భారీ స్కోరుకు కారణమయ్యాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన జార్ఖండ్ 128.4 ఓవర్లలో 387 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కర్నాటక మూడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. గతేడాది కూడా కర్నాటక అండర్-14 టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అన్వయ్ అజేయ డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.