యూజీన్ (అమెరికా) : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్-2022 జావెలిన్ త్రో (మహిళల విభాగం) లో భారత ఆశాకిరణం అన్నూరాణి ఫైనల్స్‌లో ఆశించిన మేర రాణించలేకపోయింది. ఫైనల్స్‌లో ఆమె ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఐదు ప్రయత్నాల్లో భాగంగా అన్నూ రాణి.. 61.12 మీటర్ల దూరం మాత్రమే విసరగలిగింది. ఈ పోటీల్లో అమెరికాకు స్వర్ణం, రజతం లభించగా.. జపాన్ అమ్మాయికి కాంస్యం అందింది.
యూఎస్‌లోని యుజీన్ వేదికగా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్-2022 జరుగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం జరిగిన జావెలిన్ త్రో మహిళల ఫైనల్స్‌లో అన్నూరాణి ఐదు ప్రయత్నాల్లో ఒక్కసారే 60 మీటర్ల కంటే ఎక్కువ దూరం బరిసెను విసిరింది. తొలిసారి 56.18 మీటర్లు విసిరిన రాణి.. ఆ తర్వాత వరుసగా 61.12 మీటర్లు, 58.14, 59.98, 58.70 మీటర్లు విసిరింది. ఈ సీజన్లో ఆమె బెస్ట్ 63.82 మీటర్ల దూరం నమోదైనా రాణికి కనీసం కాంస్యమైనా దక్కేది.
ఫైనల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, ఆస్ట్రేలియాకు చెందిన కెల్సీ లీ బార్బర్ 66.91 మీటర్ల దూరం విసిరి స్వర్ణం నెగ్గింది. అమెరికా త్రోయర్ కారా వింగర్ 64.05 మీటర్లతో రజతం గెలవగా.. జపాన్ అమ్మాయి హరుకా కిటగుచి 63.27 (రాణి నేషనల్ బెస్ట్ కంటే తక్కువే) మీటర్ల దూరం విసిరి కాంస్యం నెగ్గింది. అన్నూ రాణి పోరాటం ముగియడంతో ఇప్పుడు యావత్ భారతావని కళ్లన్నీ టోక్యో ఒలింపిక్స్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా మీదే ఉన్నాయి. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం చోప్రా ఫైనల్స్ జరుగుతాయి.