షార్జా: క్రికెట్లో ఉత్కంఠ మ్యాచ్‌లు సర్వసాధారణం. ఆ సందర్భంగా ఆటగాళ్లు ఉద్వేగానికి లోనవడం సహజమే. దానిని జట్లు స్ఫూర్తితో తీసుకున్నా అభిమానులు మాత్రం తేలికగా తీసుకోవడం లేదు. బుధవారం ఆసియాకప్‌లో పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సూపర్-4 మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్ల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకోగా, మ్యాచ్ అనంతరం ఇరు జట్ల అభిమానులు కొట్లాడుకున్నారు. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. ఆఫ్గన్ పేసర్ ఫరీద్ అహ్మద్, పాకిస్థాన్ బ్యాటర్ అసిఫ్ అలీ మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం, అసిఫ్ అలీ బ్యాట్‌తో అసిఫ్‌ను కొట్టినంత పనిచేయడంతో తతిమా ఫీల్డర్లు, అంపైర్లు జోక్యంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. అయితే మ్యాచ్ అనంతరం అభిమానుల మధ్య వాగ్వాదం, ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడంతో నిర్వాహకులకు నష్టం వాటిల్లినట్టు తెలిసింది. అభిమానులు అంతటితో ఆగకుండా స్టేడియం బయట ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.