IPL Media Rights | కాస్ట్లీ క్రికెట్ టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసార హక్కులు పొందేందుకు పలు సంస్థలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్, గ్లోబల్ టెక్ మేజర్ అమెజాన్లతోపాటు ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ సోనీ పిక్చర్స్ తదితర సంస్థలు వచ్చే నాలుగు ఐపీఎల్ సీజన్ల ప్రసార హక్కుల కోసం బిడ్లు దాఖలు చేశాయి. ఈ బిడ్ గెలుచుకున్న సంస్థకు ఐపీఎల్ 2023 నుంచి నాలుగేండ్ల పాటు ప్రసార హక్కులు లభిస్తాయి. ఐపీఎల్‌ను బీసీసీఐ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూడు సంస్థలతోపాటు జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్, వాల్ట్ డిస్నీ, డ్రీం 11 సంస్థలు కూడా బిడ్లు దాఖలు చేశాయని బీసీసీఐ వర్గాల కథనం. వచ్చే జూన్ 12న బీసీసీఐ ఆన్లైన్ వేలం నిర్వహించనున్నది.
2007లో బీసీసీఐ ఆధ్వర్యంలో క్రికెట్ ఇండియా కోసం పురుడు పోసుకున్నది ఇండియన్ ప్రీమియర్ లీగ్. టీ-20 క్రికెట్లీగ్లో 10 టీంలు పోటీ పడుతున్నాయి. దేశంలోని పది ప్రధాన నగరాలు కేంద్రంగా ఈ జట్లు ఏర్పాటయ్యాయి.
ఐపీఎల్ ప్రసార హక్కులపై బీసీసీఐ వేలాన్ని నాలుగు భాగాలుగా విభజించింది. ఐపీఎల్ ప్రసారం కోసం 2023 నుంచి 2027 వరకు లైవ్ స్ట్రీమింగ్, టీవీ బ్రాడ్ కాస్ట్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం చేసుకునే హక్కులు లభిస్తాయి. 2018-22 మధ్య రూ.16,347.5 కోట్లకు స్టార్ ఇండియా ఐపీఎల్ మీడియా హక్కులను గెలుచుకున్నది.