ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్ల మధ్య జరిగిన పోరులో చెన్నైదే పైచేయి అయింది. లీగ్ చరిత్రలోనే అత్యధిక సార్లు (16) డకౌట్ అయిన ప్లేయర్‌గా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ చెత్త రికార్డు మూటగట్టుకోగా.. 13 ఏండ్ల తర్వాత చెపాక్ స్టేడియంలో ముంబైపై చెన్నై తొలి విజయం సాధించింది. పేసర్లు విజృంభించడంతో ముంబై ఓ మాదిరి స్కోరుకే పరిమితం కాగా.. టాపార్డర్ రాణించడంతో ధోనీ సేన పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.
చెన్నై: అన్ని రంగాల్లో సమిష్టిగా సత్తాచాటిన చెన్నై సూపర్ కింగ్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో ఆరో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన తొలి పోరులో చెన్నై 6 వికెట్ల తేడాతో ముంబైని మట్టికరిపించింది. 2010 తర్వాత చెపాక్ స్టేడియంలో ముంబైపై ధోనీ సేన విజయం సాధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. నెహల్ వాధేరా (64; 8 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకంతో రాణించగా.. సూర్యకుమార్ యాదవ్ (26), స్టబ్స్ (20) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (0) వరుసగా రెండో మ్యాచ్‌లో డకౌట్ కాగా.. కామెరూన్ గ్రీన్ (6), ఇషాన్ కిషన్ (7), టిమ్ డేవిడ్ (2) విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో పతిరణ 3, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో చెన్నై 17.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. కాన్వే (44), రుతురాజ్ (30), రహానే (21), శివమ్ దూబే (26 నాటౌట్) తలా కొన్ని పరుగులు చేశారు. లక్ష్యం పెద్దది కాకపోవడంతో చెన్నై ప్లేయర్లు ఆడుతూ పాడుతూ విజయ తీరాలకు చేరారు. ముంబై బౌలర్లలో చావ్లా రెండు వికెట్లు పడగొట్టాడు. పతిరణకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా ఆదివారం జరుగనున్న డబుల్ హెడర్‌లో గుజరాత్‌తో లక్నో, రాజస్థాన్‌తో హైదరాబాద్ తలపడనున్నాయి.
వన్‌డౌన్‌లో దిగినా..
ఈ సీజన్లో బ్యాట్‌తో ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్న టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. 10 మ్యాచ్‌ల్లో కలిపి ఇప్పటి వరకు కేవలం 184 పరుగులు మాత్రమే చేసిన హిట్‌మ్యాన్ ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా కాకుండా.. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. అయినా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దీపక్ చాహర్ బంతిని ల్యాప్ స్కూప్ ఆడే ప్రయత్నంలో జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇషాన్, గ్రీన్ విఫలం కాగా.. అనారోగ్యం కారణంగా తిలక్ వర్మ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. నెహల్ పోరాడినా జట్టుకు పోరాడే స్కోరు అందించలేకపోయాడు.
రోహిత్ కాస్త విరామం తీసుకోవడం మంచింది. కావాలంటే చివర్లో తిరిగి ఆడినా పర్వాలేదు. ప్రస్తుతం అయితే అతడు బ్రేక్ తీసుకుంటేనే బాగుంటుంది. వచ్చే నెలలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ జరుగనున్న నేపథ్యంలో రోహిత్ తాజాగా ఉండటం ముఖ్యం.
– సునీల్ గవాస్కర్
ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా రోహిత్ శర్మ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. దినేశ్ కార్తీక్, మన్దీప్ సింగ్, సునీల్ నరైన్ 15 సార్లు డకౌట్ అయ్యారు.
సంక్షిప్త స్కోర్లు
ముంబై: 139/8 (నెహల్ 64, సూర్యకుమార్ 26; పతిరణ 3/15, దీపక్ చాహర్ 2/18), చెన్నై: 17.4 ఓవర్లలో 140/4 (కాన్వే 44, రుతురాజ్ 30; చావ్లా 2/25)