బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్స్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు భారీ షాక్ తగిలింది. గాయం తర్వాత కోలుకుని బరిలోకి దిగిన ఈ డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్.. తొలి రౌండ్లోనే నిష్క్రమించి నిరాశపరిచింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లో సింధు 21-19, 13-21, 13-21తో కొరియా అమ్మాయి కిమ్ గ యున్ చేతిలో ఓటమిపాలైంది. తొలి గేమ్‌లో 20-12తో తిరుగులేని ఆధిక్యంలో ఉన్న సింధు.. ఆ తర్వాత కిమ్ అనూహ్య పోరాటంతో వెనుకడుగు వేసింది. తొలి గేమ్ ఆఖర్లో పుంజుకున్న కిమ్.. వరుసగా రెండు గేమ్‌లు గెలుచుకుని సింధును ఇంటికి పంపించింది. మిగిలిన మ్యాచ్‌ల విషయానికొస్తే.. మిక్స్డ్ డబుల్స్‌లో రుత్విక-రోహన్ జంట 21-10, 17-21, 24-22తో తైవాన్ జోడీ యీ హాంగ్ వీ-నికోల్ చన్ను మట్టికరిపించి ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించింది. మహిళల డబుల్స్‌లో గాయత్రి-త్రిసా 21-17, 21-13తో సుంగ్ షువొ యున్- చెన్ సు యు (తైవాన్)ను చిత్తు చేశారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ద్వయం 20-22, 18-21తో డానియల్ లడ్గార్డ్, మాడ్స్ వెడ్గార్డ్ జోడీ చేతిలో ఓటమిపాలైంది. దీంతో లీగ్ దశలోనే సాత్విక్, చిరాగ్ పోరాటం ముగిసినట్లయ్యింది.