మియామి: టెన్నిస్ ఉమెన్స్ సింగిల్స్ టాప్‌సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్)కు మియామి ఓపెన్‌లో అనూహ్య షాక్ తగిలింది. ఐదుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ అయిన రెండో సీడ్ స్వియాటెక్‌కు టోర్నీ మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో 2-6, 5-7తో అలెగ్జాండ్ర ఈల షాకిచ్చింది. 19 ఏండ్ల ఈ అన్‌సీడెడ్ ఫిలిప్పీన్స్ సంచలనం.. స్పెయిన్‌లోని రఫెల్ నాదల్ అకాడమీలో శిక్షణ పొందుతుండటం గమనార్హం. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈ టోర్నీలోకి అడుగుపెట్టిన అలెగ్జాండ్ర.. స్వియాటెక్‌ను ఓడించి సెమీస్‌కు చేరుకుంది.
ఇదే టోర్నీలో ఆమె ఒస్టపెంకొ, మాడిసన్ కీస్నూ చిత్తు చేయడం విశేషం. తద్వారా ఫిలిప్పీన్స్ నుంచి టెన్నిస్ ఆడుతూ గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌ను ఓడించిన తొలి క్రీడాకారిణిగా ఆమె రికార్డులకెక్కింది. సెమీస్‌లో అలెగ్జాండ్రా.. జెస్సికా పెగులా (అమెరికా)తో తలపడనుంది. ఇదే టోర్నీ పురుషుల డబుల్స్‌లో ఆడిన భారత ఆటగాడు యుకీ బాంబ్రీ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. క్వార్టర్స్‌లో బాంబ్రీ-బోర్గ్స్ (పోర్చుగల్) ద్వయం.. 6-7 (1/7), 6-3, 2-10తో లాయిడ్ గ్లాస్పుల్-జులియన్ (యూకే) చేతిలో ఓడింది.