ఈ తరంలో టెన్నిస్ ప్రపంచాన్ని శాసిస్తున్న యువ సంచలనాలు కార్లొస్ అల్కరాజ్, యానిక్ సిన్నర్ మధ్య మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ స్పెయిన్, ఇటలీ కుర్రాళ్లు.. 2025లో వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు అర్హత సాధించారు.
కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ జోరుకు అల్కరాజ్ మరోసారి బ్రేక్ వేయగా మరో సెమీస్‌లో సిన్నర్.. కెనడా ఆటగాడు అలీయాసిమ్ను ఓడించి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు సిద్ధమయ్యాడు.
ఈ ఇద్దరి మధ్య జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో అల్కరాజ్ విజేతగా నిలువగా వింబూల్డన్‌లో అదృష్టం సిన్నర్‌ను వరించింది. మరి యూఎస్‌లో టైటిల్ ఎవరికి దక్కేనో? మహిళల సింగిల్స్‌లో అరీనా సబలెంకా, అమందా అనిసిమోవా మధ్య టైటిల్ పోరు జరగాల్సి ఉంది.
న్యూయార్క్: ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబూల్డన్ తర్వాత ముచ్చటగా మూడోసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ పోరుకు ఒకటో సీడ్ సిన్నర్ (ఇటలీ), రెండో సీడ్ కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్) సిద్ధమయ్యారు. శనివారం ఇక్కడి ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీస్ మ్యాచ్‌లో రెండో సీడ్ అల్కరాజ్.. 6-4, 7-6 (7/4), 6-2తో ఏడో సీడ్ నొవాక్ జొకోవిచ్‌ను చిత్తుచేసి తన కెరీర్లో ఏడో గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. వింబూల్డన్ తర్వాత కొద్దిరోజులు విరామం తీసుకున్న అల్కరాజ్.. యూఎస్ ఓపెన్‌లో ఒక్క సెట్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరడం గమనార్హం. 2015లో రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) తర్వాత ఈ టోర్నీలో ఒక ఆటగాడు ఒక్క సెట్ కూడా ఓడకుండా ఫైనల్ చేరడం ఇదే ప్రథమం. 2022లో ఈ టోర్నీ టైటిల్ నెగ్గాక ఈ నయా స్పెయిన్ బుల్ యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరడం ఇదే మొదటిసారి. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రెండు గంటల 23 నిమిషాల పాటు దాదాపు ఏకపక్షంగా జరిగిన పోరులో మరోసారి జొకోకు నిరాశ తప్పలేదు. మొదటి సెట్‌ను అల్కరాజ్ అలవోకగా గెలుచుకున్నా రెండో సెట్లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. జొకో పుంజుకోవడంతో ఆ గేమ్ కాస్తా టైబ్రేకర్‌కు వెళ్లినా స్పెయిన్ కుర్రాడి జోరు ముందు సెర్బియా దిగ్గజం నిలువలేకపోయాడు. మూడో సెట్ అయితే ఏకపక్షమే. జొకో గత నాలుగు గ్రాండ్‌స్లామ్ సెమీస్‌లలో మూడుసార్లు అల్కరాజ్, సిన్నర్ చేతిలోనే ఓడటం గమనార్హం.
రెండో సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ సిన్నర్ విజయం కోసం చెమటోడ్చక తప్పలేదు. 24 ఏండ్ల ఈ ఇటలీ కుర్రాడు.. 6-1, 3-6, 6-3, 6-4తో ఫెలిక్స్ అలీయాసిమ్ను ఓడించి ఈ టోర్నీలో వరుసగా రెండోసారి టైటిల్ పోరుకు చేరుకున్నాడు. ఇరువురి మధ్య 3 గంటల 21 నిమిషాల పాటు సాగిన పోరులో సిన్నర్‌ను గాయం వేధించి రెండో సెట్‌ను కోల్పోయినా అతడు పుంజుకున్న తీరు అద్భుతం. రెండో సెట్ గెలిచిన అలీయాసిమ్ ఆ తర్వాత సిన్నర్ జోరుకు తలవంచక తప్పలేదు. ఈ విజయంతో సిన్నర్ ఒక ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌లో ఫైనల్ చేరిన ఆటగాళ్లలో రాడ్ లీవర్ (1969), ఫెదరర్ (2006, 2007, 2009), జొకో (2015, 2021, 2023) తర్వాత నాలుగో స్థానంలో నిలిచాడు. ఆదివారం జరుగబోయే ఫైనల్లో అల్కరాజ్తో టైటిల్ పోరుకు దిగనున్న సిన్నర్.. 2024 నుంచి అతడితో తలపడ్డ గత ఏడు మ్యాచ్‌లలో ఆరింటినీ గెలుచుకుని ఆధిక్యంలో ఉండటం అతడికి కలిసొచ్చే అంశం.