హైదరాబాద్, ఆట ప్రతినిధి : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్-14 స్కూల్ వన్డే నాకౌట్ మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. శుక్రవారం గ్రీన్వ్యూలో జరిగిన సెమీఫైనల్ పోరులో గౌతమ్ వరల్డ్స్కూల్ 7 వికెట్ల తేడాతో పల్లవి మోడల్ స్కూల్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పల్లవి మోడల్ స్కూల్ 44.4 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. ఆర్యన్(3/19), హర్ష అర్జున్(2/16), సాయి విశ్వక్(2/25) ధాటికి పల్లవి టీమ్‌లో అనిరుధ్(63) మినహా ఎవరూ రాణించలేకపోయారు.
మిగతా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. లక్ష్యఛేదనకు దిగిన గౌతమ్ వరల్డ్ స్కూల్ 39.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. ఓపెనర్ నక్ష్రెడ్డి(117 బంతుల్లో 53 నాటౌట్, 4ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. నక్ష్రెడ్డికి తోడు అర్జున్(35 నాటౌట్) రాణించడంతో జట్టు విజయాన్నందుకుంది. అనిరుధ్(3/29)కు మూడు వికెట్లు దక్కాయి.