Ajit Agarkar : భారత క్రికెట్లో ఎందరో చీఫ్ సెలెక్టర్లను చూశాం. కానీ, సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన వాళ్లు మాత్రం కొందరే. ప్రస్తుతం ప్రధాన సెలెక్టర్ పదవిలో ఉన్న అజిత్ అగార్కర్ (Ajit Agarkar) కచ్చితంగా రెండో కోవకే చెందుతాడు. ప్రతిసారి స్క్వాడ్ ఎంపికలో తనదైన ముద్ర వేస్తున్నాడీ మాజీ పేసర్. ఇంగ్లండ్ పర్యటనకు స్క్వాడ్ ఎంపిక నుంచి ఆసియా కప్ (Asia Cup).. ఇప్పుడు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ వరకూ అతడు తనదైన పంథాను కొనసాగిస్తున్నాడు. సీనియర్లకు చెక్ పెడుతూ భావితారలకు భరోసానిచ్చేలా స్క్వాడ్ ఎంపిక ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని చెప్పకనే చెబుతున్నాడు అగార్కర్. అందుకే.. తన నిర్ణయాలను కొంతమంది విమర్శించినా.. టీమిండియా ప్రయోజనాలే తనకు ముఖ్యమని మొండిగా ముందుకు వెళ్తున్నాడు అతడు. మాజీ పేసర్ అయిన అగార్కర్ 2023 జూలై 4న చీఫ్ సెలెక్టర్ పదవి చేపట్టాడు. అప్పటి నుంచి అతడి ప్రతి నిర్ణయం సీనియర్లను ఆశ్చర్యపరిచేలా.. జూనియర్లకు అవకాశాలు కల్పించేలా ఉంటోంది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) సలహాలు, సూచనల్ని పాటిస్తూనే.. జట్టుకు ఉపయోగపడే ఆటగాళ్లను మాత్రమే తీసుకుంటున్నాడు అగార్కర్.
Top start at home. Proud of the collective effort 🇮🇳 pic.twitter.com/xYk8ZTpkL9
— Shubman Gill (@ShubmanGill) October 4, 2025
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27ను దృష్టిలో పెట్టుకొని ఇంగ్లండ్ పర్యటనకు కొత్త కెప్టెన్ అవసరమని భావించిన అతడు.. సీనియర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli)లకు సంకేతాలు ఇచ్చాడు. దాంతో.. వారిద్దరూ ఒకరివెంట ఒకరు సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. హిట్‌మ్యాన్, విరాట్ టెస్టులకు అల్విదా చెప్పడంలో చీఫ్ సెలెక్టర్, హెడ్‌కోచ్ పాత్ర ఉందనే విమర్శలు వచ్చినా అగార్కర్ వెనక్కి తగ్గలేదు. యువకుడైన శుభ్‌మన్ గిల్ (Shubman Gill)కు సారథ్యం అప్పగిస్తూ స్క్వాడ్‌ను ప్రకటించింది అతడి నేతృత్వంలోనే సెలెక్టర్లు. సీనియర్ల గైర్హాజరీలో గిల్ సమర్ధంగా జట్టును నడిపించగా.. టీమిండియా సిరీస్‌ను సమం చేసింది.
🚨 India’s squad for Tour of Australia announced
Shubman Gill named #TeamIndia Captain for ODIs
The #AUSvIND bilateral series comprises three ODIs and five T20Is against Australia in October-November pic.twitter.com/l3I2LA1dBJ
— BCCI (@BCCI) October 4, 2025
ఇక టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్ కోసం పొట్టి క్రికెట్ వీరులకే పట్టం కట్టాడు అగార్కర్. ఒకప్పటి సారథి హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, సంజూ శాంసన్‌లను తీసుకోవడమే కాదు.. గిల్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేశాడు. అనంతరం.. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు స్క్వాడ్ ఎంపికలోనూ తనమార్క్ చూపించాడు అగార్కర్. ఇంగ్లండ్ గడ్డపై విఫలమైన కరుణ్ నాయర్ (Karun Nair)పై వేటు వేసి.. పునరాగమనం కోసం నిరీక్షిస్తున్న షమీని పక్కన పెట్టేశాడు. నాయర్ స్థానంలో కుర్రాడు దేవ్‌దత్ పడిక్కల్‌కు ఛాన్స్ ఇవ్వడంతో పాటు, సాయిసుదర్శన్కు మరోమారు కొనసాగించాడు. శనివారం ఆస్ట్రేలియా పర్యటనకు స్క్వాడ్‌ను ప్రకటించిన సెలెక్టర్లు రోహిత్ శర్మకు షాకిస్తూ గిల్‌ను వన్డే కెప్టెన్‌ను చేశారు.
రెండేళ్లలో వన్డే ప్రపంచకప్ ఉన్నందున రోహిత్‌ను కాదని.. గిల్‌కే పగ్గాలు అప్పగించింది అగార్కర్ బృందం. టెస్టుల్లో సమర్ధుడైన నాయకుడిగా నిరూపించుకున్న గిల్.. వన్డేల్లోనూ టీమిండియాకు బెస్ట్ కెప్టెన్ అవుతడాని భావించడమే అందుకు కారణం. దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వరల్డ్ కప్ సన్నద్ధతకు గిల్‌కు సమయం కావాలి కాబట్టి.. ఆసీస్ సిరీస్‌తోనే అతడికి బాధ్యతలు ఇవ్వడం మంచిదని అతడు అనుకొని ఉంటాడు.
South Africa, Zimbabwe and Namibia will host the 2027 ICC ODI World Cup.
44 games will be played in South Africa, while the remaining 10 games will be played in Zimbabwe and Namibia. pic.twitter.com/BP4qhXdWRl
— Africa Facts Zone (@AfricaFactsZone) September 4, 2025
తనదైన ముందు చూపుతో అగార్కర్ నిర్ణయాలు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు సీనియర్లను బాధించినా.. జట్టు ప్రయోజనాల రీత్యా అతడిని తప్పు పట్టలేని పరిస్థితి. అందుకే.. కొందరు విమర్శిస్తున్నా.. చాలామంది మాత్రం అతడి ముక్కుసూటితనాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. పొమ్మనలేక పొగబెట్టే ధోరణి కాకుండా.. తనకు ఏం కావాలి? జట్టుకు ఏది మంచిది? అనే విషయంలో అగార్కర్‌కు ఉన్న స్పష్టత భారత క్రికెట్లో కొత్త ఒరవడికి నాంది పలికిందనే చెప్పాలి.